ఇన్నాళ్లు ఢిల్లీనే అనుకున్నాం.. ఇప్పుడు హైదరాబాద్ కూడా.. పొల్యుషన్లో మన సిటీ ఇంత డేంజర్లో ఉందా !

ఇన్నాళ్లు ఢిల్లీనే అనుకున్నాం.. ఇప్పుడు హైదరాబాద్ కూడా..  పొల్యుషన్లో మన సిటీ ఇంత డేంజర్లో ఉందా !
  • దేశంలో డస్ట్  పొల్యూషన్లో టాప్లో సిటీ
  • హైదరాబాద్ గాలిలో ప్రమాదకరంగా దుమ్ముధూళి..
  • ప్రపంచంలో సెకండ్ పొల్యూటెడ్  సిటీగా రాజధాని
  • అట్మాస్ఫియరిక్  కెమిస్ట్రీ అండ్  ఫిజిక్స్ జర్నల్  స్టడీలో వెల్లడి
  • 2007 నుంచి 2022 మధ్య ప్రపంచవ్యాప్తంగా 81 నగరాల్లో గాలి నాణ్యతపై అధ్యయనం


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ గాలి ప్రమాదకరమైన ధూళికణాలతో నిండిపోయింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్  సైన్స్  జర్నల్ ‘అట్మాస్ఫియరిక్  కెమిస్ట్రీ అండ్  ఫిజిక్స్’ నివేదిక తెలిపింది. పీఎం2.5 ధూళికణాలు ఎక్కువగా ఉన్న సిటీల్లో ప్రపంచంలోనే హైదరాబాద్  నాలుగో స్థానంలో ఉండగా, పీఎం10 ధూళికణాల సాంద్రతలో రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.

 దేశంలో ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలను కూడా వెనక్కి నెట్టి పీఎం2.5, పీఎం10 ధూళికణాలు అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 2007 నుంచి 2022 మధ్య శాటిలైట్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ స్టడీ చేశారు. యూరోపియన్  స్పేస్  ఏజెన్సీ (ఈఎస్ఏ), లైడర్  క్లైమెటాలజీ ఆఫ్  వెర్టికల్  ఏరోసాల్ స్ట్రక్చర్ (ఎల్ఐవీఏఎస్) సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 81 మెగా సిటీల్లో శాటిలైట్ ఆధారిత డస్ట్  క్లైమేట్  డేటాను విశ్లేషించారు. 

ఢిల్లీ, బీజింగ్, న్యూయార్క్ కన్నా.. 

స్థూల ధూళికణాల (పీఎం10) కన్నా అత్యంత ప్రమాదకరమైనవి సూక్ష్మ ధూళికణాలు (పీఎం2.5). ఇవి మన వెంట్రుక మందంలో 30వ వంతు మాత్రమే ఉంటాయి. అంత సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి శ్వాస ద్వారా సులువుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి నేరుగా రక్తంలోకి కలిసిపోతాయి. హైదరాబాద్ గాలిలో ఈ ప్రాణాంతక పీఎం2.5 కణాల గాఢత క్యూబిక్  మీటర్‌‌కు 98.7 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఇది 5 మైక్రోగ్రాములకు మించకూడదు. పాకిస్తాన్‌‌ లోని కరాచీ, లాహోర్, చైనాలోని జియాన్  నగరాలు మాత్రమే హైదరాబాద్  కన్నా  ముందున్నాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బీజింగ్, షాంఘై, కోల్‌‌కతా, కైరో, బాగ్దాద్, మెక్సికో సిటీ, ఇస్తాంబుల్, టోక్యో, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, లండన్ నగరాలు హైదరాబాద్  తర్వాత ఉన్నాయి. 

ర్యాపిడ్ అర్బనైజేషనే కారణం 

జనాభా పెరుగుదల, పట్టణీకరణే కాలుష్యం పెరగడానికి కారణమని స్టడీ స్పష్టం చేసింది. 2018 నాటికి ప్రపంచ జనాభాలో 55% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఈ సంఖ్య 2030 నాటికి 60 % పెరుగుతుందని అధ్యయనం గుర్తుచేసింది. మానవుల వల్ల ఉత్పత్తి అయ్యే ఆంత్రోపోజెనిక్  డస్ట్ కూడా కాలుష్యంలో కీలక పాత్ర పోషిస్తుందని స్టడీ స్పష్టం చేసింది. 

నివారణ చర్యలు చేపట్టాలి 

ఈ స్టడీ ప్రకారం 2032 నాటికి హైదరాబాద్‌‌లో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అప్పటికి నగర జనాభా 2.41 కోట్లకు చేరుకుంటుందని, అదే సమయంలో పీఎం10 ధూళికణాల సాంద్రత 86.8 మైక్రోగ్రాములకు, పీఎం2.5 ధూళికణాల సాంద్రత 78.4 మైక్రోగ్రాములకు చేరుకుంటుందని అధ్యయనం  అంచనా వేసింది. ప్రజా రవాణాను మెరుగుపరచడం, ఈవీలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. 

పీఎం10.. టాప్ సెకండ్‌‌లో

స్టడీ ప్రకారం..  స్థూల ధూళికణాల (పీఎం10) సాంద్రతలో హైదరాబాద్  ప్రపంచంలోనే రెండో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. సౌదీ అరేబియాలోని రియాద్  మాత్రమే హైదరాబాద్  కన్నా ముందుంది. హైదరాబాద్‌‌లో స్థూల ధూళికణాల (పీఎం10) గాఢత క్యూబిక్  మీటర్‌‌కు  సగటున 121.2 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. ఇది డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన వార్షిక సగటు సురక్షిత పరిమితి 5 మైక్రోగ్రాముల కన్నా 8 రెట్లు ఎక్కువ.

ధూళి కణాలతో ప్రాణాంతక వ్యాధులు 

పీఎం2.5 సూక్ష్మ ధూళికణాలు ఊపిరితిత్తులలోకి చేరి, రక్తంలో కలుస్తాయి. దీనివల్ల ఆస్తమా, బ్రాంకైటిస్,  గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్  వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 
– డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్.