పంక్చువాలిటీలో హైదరాబాద్ ఎయిర్​పోర్టుకు మొదటి ర్యాంకు

పంక్చువాలిటీలో హైదరాబాద్ ఎయిర్​పోర్టుకు మొదటి ర్యాంకు

హైదరాబాద్,వెలుగు: ప్రపంచంలోనే అత్యంత సమయపాలన (పంక్చువల్) కలిగిన విమానాశ్రయంగా జీఎంఆర్​ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్టు.. హైదరాబాద్ విమానాశ్రయం ఈ ఏడాది మార్చిలో 90.43శాతం ఆన్–టైమ్ పెర్ఫామెన్స్(ఓటీపీ)ను సాధించిందని వెల్లడించింది. ఈ నివేదికలో ప్రపంచంలోనే 90 శాతం మార్కును దాటిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ ఎయిర్​పోర్టు కావడం విశేషం. సిరియమ్ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకుపైగా విమానాలను సమీక్షించింది.

హైదరాబాద్​ విమానాశ్రయం 'గ్లోబల్ ఎయిర్‌‌‌‌పోర్ట్స్', 'లార్జ్ ఎయిర్‌‌‌‌పోర్ట్స్' విభాగాల్లో మొదటిస్థానంలో నిలిచింది. ఇది గత నవంబర్లో 88.44శాతం ఓటీపీతో 'లార్జ్ ఎయిర్‌‌‌‌పోర్ట్స్' విభాగంలో 4వ స్థానంలో నిలిచిందని విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్ చెప్పారు. ఈ ఘనతను సాధించడానికి కొత్త టెక్నాలజీలను, కొత్త విధానాలను అమలు చేశామని చెప్పారు. విమానాశ్రయ పనితీరును మరింత పెంచడం కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించామని అన్నారు. ఇంటిగ్రేటెడ్ సెంట్రలైజ్డ్ ఎయిర్‌‌‌‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఏఓసీసీ), ఎక్స్‌‌‌‌ప్రెస్ సెక్యూరిటీ చెక్-ఇన్, సెల్ఫ్ చెకిన్ కియోస్క్‌‌‌‌లు, ఈ–బోర్డింగ్, వీడియో అనలిటిక్స్ మొదలైనవి ఆన్ టైమ్ పెర్ఫామెన్స్‌‌‌‌ను (ఓటీపీ) పెంచాయని వివరించారు.