
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను నానక్ రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మంగళవారం విడుదల చేశారు. చివరగా 2012లో బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను హైదరాబాద్ విడుదల చేసిందని, ఇప్పుడు దీన్ని రెండోసారి రూపొందించిన నగరంగా సరికొత్త రికార్డును భాగ్యనగరం నెలకొల్పిందని ఆయన అన్నారు.
నగరం పరిధిలో జీవవైవిధ్య పరిరక్షణకు ఈ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పట్టణాల్లో గ్రీనరీని పెంచడంపై దృష్టిపెట్టిన మున్సిపాలిటీలకు, వాటి సిబ్బందికి జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరిత అవార్డులను అందజేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఇండెక్స్‌లో ఏముందంటే..
బయోడైవర్సిటీ ఇండెక్స్ లోని 23 విభాగాల్లో మొత్తం 92 మార్కులకుగానూ హైదరాబాద్ 57 మార్కులను సాధించింది. నగరంలో దాదాపు 2వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350కి పైగా జల వనరులు, 1600 హెక్టార్లలో విస్తరించి ఉన్న సహజ రాళ్లగుట్టలు, 2 జాతీయ పార్కులు జీవవైవిధ్యానికి దోహదం చేస్తున్నాయని ఇండెక్స్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 1305 వృక్షజాతులు, 577 ప్రాంతీయ వృక్ష జాతులు, 728 ఇతర ప్రాంత వృక్ష జాతులు ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. 30 రకాల తూనీగలు, 141 రకాల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల ఉభయచరాలు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు నగరంలో ఉన్నాయని పేర్కొన్నారు.