కార్పొరేటర్ల చేరికలతో గ్రేటర్ లో కాంగ్రెస్ బలోపేతం

కార్పొరేటర్ల చేరికలతో గ్రేటర్ లో కాంగ్రెస్ బలోపేతం

జీహెచ్ఎంసీలోని బీఆర్ఎస్ ​కార్పొరేటర్లు కాంగ్రెస్​వైపు చూస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లోపు కారు దిగి, హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. దీంతో కాంగ్రెస్​కార్పొరేటర్ల సంఖ్య 14కు చేరింది. త్వరలో మరో 15 మందికి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్​కు గుడ్​బై చెబుతారని తెలుస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు గ్రేటర్​పరిధిలో కాంగ్రెస్ పార్టీ కాస్త వీక్​గా ఉంది. ఎన్నికల్లోనూ ఊహించిన రిజల్ట్ రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​గాలి వీచినప్పటికీ, గ్రేటర్ లో ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్కచోట కూడా కాంగ్రెస్​గెలవలేకపోయింది. గ్రేటర్ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్​ప్లాన్​చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ లోని ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పలువురు టచ్ లో ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల లోపు చేరికలు ఉంటాయని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. గత నెలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్​లో చేరగా, కొద్దిరోజుల్లో ఎమ్మెల్యేతోపాటు పలువురు కార్పొరేటర్లు చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కాంగ్రెస్ ​బలం 14

మూడేండ్ల కింద జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు, బీజేపీ నుంచి 48 మంది కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 44 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇందులో ప్రమాణ స్వీకారానికి ముందే బీజేపీ నుంచి గెలుపొందిన లింగోజీగూడ కార్పొరేటర్ మరణించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్​గెలిచింది. ఆ తరువాత ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతావారు పార్టీలు మారారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 51, ఎంఐఎంకు 44, బీజేపీకి 40, కాంగ్రెస్​కు 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గుడిమల్కాపూర్ తో పాటు ఆ సీట్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.