లిక్కర్ స్కాం : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా

లిక్కర్ స్కాం : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ముందుగా బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అభిషేక్ పలుకుబడి కలిగిన వ్యక్తి అని, సాక్షులను ప్రభావితం చేస్తారని వాదన వినిపించింది. బెయిల్ ఇస్తే దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉందని సీబీఐ తెలిపింది. గత విచారణలో అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టేయాలని సీబీఐ కోరింది. తాజాగా అభిషేక్ రావు తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ..  "ఈ కేసులో ఎలాంటి ఆధారాలు సీబీఐకి దొరకలేదు. నెల రోజుల నుంచి అభిషేక్ కస్టడీలో ఉన్నారు. కేవలం నగదు లావాదేవీలకు సంబంధించిన అభియోగాలు మాత్రమే అభిషేక్ పై ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆంధ్రప్రభతో అభిషేక్ కి ఎలాంటి సంబంధాలు లేవు. ఆయనకు అందులో షేర్స్ కూడా లేవు. సమీర్ మహేంద్రుతో ఎలాంటి నగదు లావాదేవీలు చేయలేదు’’ అని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అభిషేక్ తరపు న్యాయవాది వివరించారు.   

ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం రోజున (14 వ తేదీన) సాయంత్రం 4 గంటలకు ఉత్తర్వులు ఇస్తామన్నారు.  

లిక్కర్ పాలసీ రూపకల్పనలో..

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ది చేకూరేలా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ వ్యవహరించిందని సీబీఐ ఆరోపించింది. తెలంగాణ మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈనేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లిని అక్టోబర్10న అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి అభిషేక్ తీహార్ జైలులో ఉన్నారు.

రాజకీయ నేతలతో సంబంధాలు

లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌లో భాగంగా అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండో స్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు అకౌంట్లలోకి రూ.3.85 కోట్లు వచ్చినట్లు కోర్టుకు అక్టోబరు 30న సీబీఐ తెలిపింది. ముందుగా సౌత్‌‌‌‌ లాబీ పేరుతో ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొంది. అయితే, మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ కు రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇదే వ్యవహారంలో ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇదివరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.