హైదరాబాద్‌లో పిల్లుల పండుగ..  పంజా విసిరితే చాంపియన్!

హైదరాబాద్‌లో పిల్లుల పండుగ..  పంజా విసిరితే చాంపియన్!

పిల్లులు ఇప్పుడు ఇంట్లో పెంచుకునే పెట్స్‌ మాత్రమే కాదు.. వాటి కోసం ప్రత్యేకంగా షోలు, చాంపియన్‌షిప్‌లు, గేమ్స్, గ్రూమింగ్, అందం, బ్రీడ్, అడాప్షన్, ఫ్యాషన్ కాంటెస్టులు, పెట్ బ్రాండ్స్ అంటూ ఓ ప్రత్యేక కల్చర్‌ హైదరాబాద్‌లో పెరుగుతోంది. నగరంలో అక్టోబరు11వ తేదీన  క్యాట్ చాంపియన్‌షిప్ 2026 ఈవెంట్ సందడి కనిపించనుంది.

హైదరాబాద్‌లో తొలిసారిగా కాదు కానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే క్యాట్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. అందం, బ్రీడ్, గ్రూమింగ్, ప్రవర్తనలో  సత్తా చాటేందుకు 300కు పైగా పిల్లులు పోటీ పడనున్నాయి. ఈ పిల్లులు..10కిపైగా బ్రీడ్స్ 300కు పైగా పోటీల్లో పాల్గొనే పిల్లుల్లో టాప్ –10ను అంతర్జాతీయ జడ్జిలు ఎంపిక చేయనున్నారు.  ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా అనే భారతదేశపు ఏకైక పిల్లుల నమోదు సంస్థ పిల్లుల ప్రదర్శనల (Cat Shows) ద్వారా పిల్లుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తోంది. పిల్లులు ట్రోఫీలు, బహుమతుల కోసం పోటీపడతాయి. భారతదేశపు దేశీయ జాతి పిల్లులను కూడా ఈ షోలో ప్రదర్శించనున్నారు. దీనివల్ల సందర్శకులకు దేశంలోని కొన్ని పిల్లి జాతులను చూసే అవకాశం లభిస్తుంది.

చాంపియన్ షిప్ క్యాట్ షో 2026


హైదరాబాద్ నగరంలోని పెట్ లవర్స్​కు శుభవార్త. ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా పిల్లుల ఉత్సవంలో భాగంగా చాంపియన్ షిప్ క్యాట్ షో 2026 ను హైదరాబాద్​లో అక్టోబరు11న ఆదివారం నిర్వహించనుంది. రాజేంద్రనగర్ లోని ఫిష్ బిల్డింగ్ వద్ద ఉన్న ఉట్టూరు మొగ్ధంపూర్ రోడ్డులో పిల్లర్ నంబరు 247 వద్ద ఉన్న హెచ్ఎఫ్ కన్వెన్షన్​లో ఈ క్యాట్ షో ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లుల ప్రదర్శనలో పాల్గొనేందుకు పెట్ లవర్స్, ఫ్యామిలీస్, కపుల్స్, పిల్లలకు అవకాశం కల్పించనున్నారు. ఈ షోలో పెట్ లవర్స్, పిల్లల కోసం ఫన్ యాక్టివిటీస్​తోపాటు వివిధ రకాల గేమ్స్ నిర్వహించనున్నారు. ఈ షోలో పది బ్రీడ్స్​కు చెందిన 300కు పైగా పిల్లులు పాల్గొంటాయని ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధి షాదాబ్ చెప్పారు. ఈ ప్రదర్శనలో ఫొటో బూత్, ఇండియన్ బ్రీడ్ పిల్లులు పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు ట్రోఫీలతోపాటు గిఫ్ట్ హాంపర్లను ప్రదానం చేయనున్నట్లు షాదాబ్ వివరించారు.

టాప్ టెన్ పిల్లులకు ట్రోఫీలు

ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతీ ఏటా దేశంలోని 31 నగరాల్లో పిల్లుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఆ క్లబ్ ప్రతినిధి సమజ్ చెప్పారు.  హైదరాబాద్ చాంపియన్ షిప్ క్యాట్ షో 2026లో 300 మందికి పైగా క్యాట్ లవర్స్ పాల్గొంటారని ఆమె తెలిపారు. పిల్లుల బ్రీడ్, వాటి ఆరోగ్యం, హైజినిక్, గ్రూమింగ్ అంశాలను పరిశీలించి అంతర్జాతీయ న్యాయనిర్దేతలు టాప్ టెన్ పిల్లులను ఎంపిక చేస్తారని ఆమె వెల్లడించారు. ఉత్తమ పిల్లులను ఎంపిక చేసి వాటిని పెంచుకుంటున్న పెట్ లవర్స్​కు ట్రోఫీలు, గిఫ్ట్ హ్యాంపర్లను ప్రదానం చేస్తామని సమజ్ వివరించారు. సందర్శకులు అంతర్జాతీయ క్యాట్ షో, క్యాట్ గేమ్స్, ఒక ఆట స్థలం, ఒక అడ్వెంచర్ మేజ్‌ను కూడా ఆస్వాదించొచ్చు. ఇది కేవలం ఒక క్యాట్ షో మాత్రమే కాదు.. ఇది సాటిలేని అనుభవం అంటారు హైదరాబాద్​కు చెందిన పెట్ లవర్ ఎం రేణుక.

పిల్లులే ప్రధాన ఆకర్షణ

పిల్లులే ప్రధాన ఆకర్షణగా ఈ ఛాంపియన్ షిప్ పోటీ ఉంటుంది. పిల్లుల జాతీయ, ప్రాంతీయ చాంపియన్‌షిప్ స్థాయి ప్రదర్శనలలో పోటీపడి, విలువైన బెస్ట్ ఇన్ షో పాయింట్లను సాధించండి.జాతీయ స్థాయి ప్రదర్శనలో 200 పాయింట్లు, ప్రాంతీయ స్థాయి ప్రదర్శనకు 150 పాయింట్లు, చాంపియన్‌షిప్ ప్రదర్శనలో 100 పాయింట్లు ఉంటాయని, ప్రతి పాయింట్ చాలా కీలకమని, బెస్ట్ ఇన్ షోలో 2వ స్థానం నుంచి 10వ స్థానం వరకు వచ్చే ప్రతి తదుపరి స్థానానికి పాయింట్లలో 10 శాతం తగ్గింపు ఉంటుందని షో నిర్వాహక ప్రతినిధి సమజ్ చెప్పారు.

క్యాట్ షో

మీ పిల్లితో లేదా పిల్లి లేకుండానే ‘క్యాట్ షో హైదరాబాద్’ను సందర్శించండి! మీ ప్రియమైన వారితో రండి, జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోండి. పెంపుడు జంతువుల ప్రేమికుల కోసం హైదరాబాద్‌లో పిల్లులు, పోటీలు, కార్యకలాపాలు, షాపింగ్, వినోదంతో కూడిన పెంపుడు జంతువుల కార్యక్రమం. హైదరాబాద్‌లోని పిల్లుల యజమానులారా... మీ పిల్లికి అందరి దృష్టిని ఆకర్షించే సత్తా ఉందని భావిస్తున్నారా? అయితే మీ ప్రియమైన పిల్లిని ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఛాంపియన్‌షిప్ క్యాట్ షో – 2026 హైదరాబాద్​కు తీసుకురండి. పిల్లుల ఛాంపియన్‌షిప్ పోటీలతో కూడిన ఈ అద్భుతమైన వేడుకలో భాగం అవ్వండి అని ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కోరారు.