
- ఇద్దరు నిందితులు అరెస్టు.. 25 తులాల బంగారం స్వాధీనం
ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన దొంగతో పాటు సొత్తును పంచుకున్న మరో దొంగను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు.
చిక్కడపల్లిలో రిటైర్డ్ ఉద్యోగి డి.నారాయణ ఇంట్లో ఈ నెల 15న భారీ చోరీ జరిగింది. దర్యాప్తు ప్రారంభించిన క్రైం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. కర్నాటక హుబ్లీకి చెందిన డార్ల నేహమియా అలియాస్ బ్రూస్లీ(28), ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన సాయికుమార్(34) చర్లపల్లి జైలులో స్నేహితులయ్యారు. బ్రూస్లీపై ఇప్పటికే 67, సాయికుమార్‌పై 63 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13న బ్రూస్లీ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఇందుకు సాయికుమార్ కొంత ఖర్చు భరించాడు.
జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే చిక్కడపల్లిలో బ్రూస్లీ చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన సొత్తులో కొంత సొత్తును సాయికుమార్ కు లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇచ్చాడు. అదే సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 25.8 తులాల బంగారు ఆభరణాలు, రూ.23 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపించారు. వీరిద్దరిపై పీడీ యాక్ట్ కూడా ఉంది. సమావేశంలో అడిషనల్ డీసీపీ బి.ఆనంద్, చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ పాల్గొన్నారు.