మృత్యుపాశాలుగా చైనా మాంజాలు.. రోడ్డు ఎక్కాలంటేనే జంకుతున్న ప్రజలు

మృత్యుపాశాలుగా చైనా మాంజాలు.. రోడ్డు ఎక్కాలంటేనే జంకుతున్న ప్రజలు
  • పక్షులకూ ప్రాణసంకటమే
  • నిషేధం ఉన్నా యథేచ్ఛంగా విక్రయాలు 
  • తూతూ మంత్రంగా పోలీసుల తనిఖీలు

చందానగర్, వెలుగు: తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. హైదరాబాద్ నగరంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి బిల్డింగ్​లపై రంగురంగుల పతంగులు ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకొస్తోంది. నిషేధం ఉన్నా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్​లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండడంతో బైకర్లు, వాకర్లు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పక్షులు కూడా ఈ మాంజాకి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి.

అసలేంటీ ఈ చైనా మాంజా?

సాధారణ నూలు దారానికి భిన్నంగా చైనా మాంజాను నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేసి దానిపై గాజు పొడి, లోహపు ముక్కల పూత పూస్తారు. ఇది ఎంత పదునుగా ఉంటుందంటే గాలిలో వేలాడుతున్న ఈ దారం బైక్​పై వెళ్లే వారి గొంతుకు తగిలితే క్షణాల్లో లోతైన గాయాలు కలిగిస్తుంది. వీటితో పతంగులు ఎగరవేసే వ్యక్తుల చేతి వేళ్లు సైతం తెగిన సందర్భాలు ఉన్నాయి. 

ఇటీవల వరుస ప్రమాదాలు

హైటెక్​సిటీలోని ఓ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఇటీవల బైక్​పై పని నిమిత్తం లింగంపల్లి మార్కెట్​రోడ్డులో వెళ్తుండగా మెడకు చైనా మాంజా తగిలింది. మార్కెట్​లో రద్దీ ఉండడం, తక్కువ వేగంతో వెళ్తుండగా పెను ప్రమాదం తప్పింది. ఆ కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇటీవల మేడ్చల్ జిల్లా కీసరలో ఒక యువకుడి మెడకు ఈ మాంజా చుట్టుకోవడంతో ఏకంగా 19 కుట్లు పడ్డాయి. తాజాగా హైదరాబాద్​ శంషీర్​గంజ్​ ప్రాంతంలో బైక్​పై వెళ్తున్న నవాబ్​సాహెబ్​కుంట ప్రాంతానికి చెందిన జమీల్​అనే యవకుడి మెడకు చైనా మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. గొంతు తెగడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గతంలో ఇదే మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

విచ్చలవిడిగా విక్రయాలు

ప్రమాదకర చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నిషేధం ఉన్నా కూడా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్​లో విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ధూల్​పేట, మంగళ్‌‌ హాట్, బేగంబజార్ వంటి ప్రాంతాల్లో రహస్యంగా అమ్ముతున్నారు. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి మార్కెట్​ ప్రాంతంలో కూడా చైనా మాంజాను బహిరంగంగా అమ్ముతున్నారు. 

పోలీసుల తనిఖీలు తూతూ మంత్రంగానే...

చైనా మాంజాపై పోలీసులు నిఘా పెట్టాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మార్కెట్​లో ఇష్టానుసారంగా చైనా మాంజాను అమ్ముతున్నా పోలీసులు అప్పుడప్పుడు కొన్ని దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ప్రధాన హోల్‌‌సేల్ సరఫరాదారులపై నిఘా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు తూతూ మంత్రంగానే తనిఖీలు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  

24 బాబిన్ల చైనా మాంజా సీజ్ 

ఓల్డ్​సిటీ, వెలుగు: ఉప్పుగూడలోని అశోక్ నగర్‌‌కు చెందిన కందాడి ఉదయ్ కిరణ్ వద్ద పోలీసులు సోమవారం18 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛత్రినాకలోని శివ గంగా నగర్​కు చెందిన పిట్టల సుమిత్ 6 బాబిన్లను సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఛత్రినాక సీఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ తెలిపారు.

చైనా మాంజా పట్టిస్తే రూ.5 వేలుఎమ్మెల్యే దానం బంపర్ ఆఫర్

పంజాగుట్ట, వెలుగు: చైనా మాంజా వాడకాన్ని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గ పరిధిలో  చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే రూ.5 వేల బహుమానం ఇస్తానని తెలిపారు. సోమవారం బంజారాహిల్స్​లోని ఆయన నివాసంలో కార్యకర్తలతో మాట్లాడుతూ.. చైనా మాంజా వల్ల మనుషులతో పాటు పక్షులు ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. చైనా మాంజా విక్రయిస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నగదు బహుమానంగా అందజేస్తామన్నారు. 

ఇయ్యాల హెచ్‌‌ఆర్‌‌సీలో విచారణ  

పద్మారావునగర్, వెలుగు: చైనా మాంజా ప్రమాదాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీ ఎస్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ) కేసు నమోదు చేసింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదుతో ఈ కేసును విచారణకు స్వీకరించింది. చైనా మాంజాను అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొంటూ హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు. ఈ కేసు ఇవాళ హెచ్‌‌ఆర్‌‌సీ చైర్‌‌ పర్సన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది