కనులపండువగా రామయ్య తెప్పోత్సవం

కనులపండువగా రామయ్య తెప్పోత్సవం
  • హంసవాహనంపై గోదావరిలో విహరించిన సీతారాములు
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

భద్రాచలం, వెలుగు : భద్రాచల సీతారాములు తెప్పోత్సవం సోమవారం రాత్రి కనులపండువగా జరిగింది. ప్రతి ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు రోజు హంసాలంకృత తెప్పపై సీతారామచంద్రస్వామిని విహరింపజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి రామయ్యకు పంచామృతాలు, విశేషన దీజలాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం అనంతరం ముత్తంగి సేవ జరిపారు. సాయంత్రం దర్బారు సేవ ముగిశాక.. స్వామివారిని ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు. ముస్తాబు చేసిన హంస వాహనాన్ని ప్రోక్షణ జలాలతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు.

లాంచీ నడిపే సరంగుకు స్వామివారి శేషవస్త్రాలు అందజేసి, గోదావరికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. తర్వాత హంసవాహనంపై స్వామివారిని అధిష్ఠింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వేదపఠనం చేశారు. పటాకుల పేలుళ్లు, భక్తుల జయజయధ్వానాలు, రామనామ సంకీర్తనలు, కోలాటాలు, చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ తెప్పోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కరకట్ట పైభాగం, ఇసుక తిన్నెలపై కూర్చొని తెప్పోత్సవాన్ని వీక్షించారు. హంసవాహనంలో ఆసీనుడైన రామయ్యకు కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌, ఎండోమెంట్‌‌ అడిషనల్‌‌ కమిషనర్‌‌ శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఎస్పీ రోహిత్‌‌రాజ్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వేణుగోపాలరావు, ఏఎస్పీ విక్రాంత్‌‌కుమార్‌‌ సింగ్‌‌, సబ్‌‌ కలెక్టర్‌‌ మృణాళ్‌‌ శ్రేష్ఠ, ఈవో దామోదద్‌‌రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

ఇయ్యాల ఉత్తరద్వార దర్శనం

భద్రాద్రి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్య ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు. ఉత్తరద్వారానికి ఎదురుగా ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు సెక్టార్లతో పాటు మిథిలా ప్రాంగణంలో ఉచితంగా భక్తులు కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.