ఉన్నావ్ ఉదంతంపై.. మౌనమూ ఒక నేరమే! సమాజం గెలవాల్సిన యుద్ధం

ఉన్నావ్ ఉదంతంపై.. మౌనమూ ఒక నేరమే! సమాజం గెలవాల్సిన యుద్ధం

మన దేశ ప్రజాస్వామ్యంలో ఉన్నావ్ అత్యాచార కేసు ఒక నేర ఘటన మాత్రమే కాదు. ఇది మన రాజ్యాంగ నైతికతకు వేసిన బహిరంగ ప్రశ్న. ఒక దళిత బాలికపై అత్యాచారం, ఆపై ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో అనుమానాస్పద మరణం, సాక్షులపై బెదిరింపులు, బాధితురాలిని హత్య చేయడానికి జరిగిన కుట్రలు, చివరికి నిందితుడికి బెయిల్. నిన్న ఆ బెయిల్​ను సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. ఈ మొత్తం పరిణామాలు దేన్ని సూచిస్తున్నా యి?  ఈ కేసు ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, ఇది దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు దారితీయాల్సిన సామూహిక సమస్య.

2017లో అత్యాచారం జరిగింది. బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. 2018లో సీఎం నివాసం ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో దేశం కదిలింది; అదే సమయంలో ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మరణించాడు. మొదట సహజ మరణమన్నారు. పోస్ట్‌‌మార్టమ్ వెలుగులోకి వచ్చాక నిజం బయటపడింది. ఇది వ్యవస్థ తప్పిదం కాదు, ఇది వ్యవస్థ స్వభావం. 

ఈ వ్యవస్థను నడుపుతున్న పాలకులు, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఈ మొత్తం దారుణానికి  బాధ్యత  కాదా? 2019లో ఆమె కోర్టుకు వెళ్తున్నప్పుడు ట్రక్కుతో ఢీకొట్టి హత్య చేయాలని ప్రయత్నించారు. ఇద్దరు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. . కానీ మొన్న  అదే నిందితుడికి బెయిల్ ఇచ్చింది. నిన్న  అదే నిందితుడి బెయిల్​ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ మొత్తం ప్రయాణం  ఏం సూచిస్తోంది?  ఇది రాజ్యాంగంలో ఉన్న సమానత్వ భావన పూర్తిగా కూలిపోయిన స్థితిని బట్టబయలు చేస్తోంది.

మౌనం వీడాలి
ఈ కేసులో బాధితురాలు దళిత మహిళ. ఆమె జీవితం, గౌరవం, భద్రత, ఇవన్నీ ఈ వ్యవస్థకు ఖర్చులేని అంశాల్లా మారాయి. అదే నిందితుడు అగ్రకులానికి చెందిన రాజకీయ నేత.  రాజ్యాంగం ప్రతి మనిషికి జీవన హక్కు హామీ ఇస్తుంది.  న్యాయవ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే, రాజ్యాంగం పుస్తకాలలో మాత్రమే మిగులుతుంది. పరిష్కారం ఒక్కటే. ప్రజలు మౌనం విడిచిపెట్టాలి. 

ఈ మౌనం అనేది తటస్థత కాదు, ఇది నేరానికి మౌన మద్దతు. లైంగిక నేరాలపై బెయిల్ విధానాన్ని రాజ్యాంగ స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలి. సాక్షుల రక్షణకు నిజమైన చట్టబద్ధ భరోసా కల్పించాలి. న్యాయవ్యవస్థలో కుల–వర్గ ఆధిపత్యంపై విచారణ జరగాలి. 

ఇవన్నీ జరగకపోతే ఉన్నావ్ వంటి కేసులు ఆగవు, అవి పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈ పోరాటం కేవలం బాధితుల కుటుంబాలు, దళిత సంఘాలు లేదా మహిళా సంఘాల పరిమితి కాదు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి సమూహం మాట్లాడాలి.   స్త్రీల భద్రతపై మౌనం పాటించడం కూడా ఒక నేరంలో భాగస్వామ్యం కావడమే.

ఈ సందర్భంగా ఒక మౌలిక ప్రశ్నను మన సమాజం తనలోనే వేసుకోవాలి అదేమంటే, “స్త్రీని చంపడం, మానం తీయడం అనేది "మనమంతా హిందువులం, గంగాసింధు బిందువులం అని చెప్పుకునే" మన మాటలు, స్త్రీని అత్యాచారం చేయవచ్చా ?” ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పే వరకూ ఈ దేశం స్త్రీలకు సురక్షితంగా మారదు.

పోరాడలేని ప్రతిపక్షాలు !
ఉన్నావ్ వంటి ఘటనలు భారత ప్రజాస్వామ్యాన్ని కుదిపేస్తున్న ఈ సందర్భంలో ప్రతిపక్షాలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు  వ్యతిరేకంగా ఒక దీర్ఘకాలిక, విశ్వసనీయ, ప్రజా ఉద్యమాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నాయి? ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతర పోరాటం చేయడం ద్వారానే రాజకీయ విశ్వాసం ఏర్పడుతుందనే మౌలిక సత్యాన్ని ప్రతిపక్షాలు విస్మరిస్తున్నాయి. 

ముఖ్యంగా ఉత్తర భారతీయ సమాజంలో దళిత–బహుజన కులాల మీద జరుగుతున్న  పురుషాధిపత్య హత్యాకాండలకు వ్యతిరేకంగా ఒక బలమైన సామాజిక, రాజకీయ పోరాటం నిర్మించలేకపోవడం, సమాజాన్ని తమ నుంచి దూరం చేసుకోవడమే అవుతుంది. ఓబీసీలకు, గిరిజన, దళిత వర్గాలకు, కులాలకు పరస్పర సమన్వయం ఏర్పడితే అదే జాతీయ స్థాయిలో కొత్త భరోసాగా మారుతుంది.  ఈ దృష్టి  పాలకవర్గాలకు లేకపోవడం మన సమాజ దౌర్భాగ్యం. 

సమాజం గెలవాల్సిన యుద్ధం
ఈ పోరాటం కోర్టు గదుల దగ్గరలోనే ముగియకూడదు. ఎందుకంటే న్యాయం కోర్టుల్లో ఓడిపోయినప్పుడు, అది సమాజం గెలవాల్సిన యుద్ధంగా మారుతుంది. ఇది ప్రతి ఇంటి తలుపు దగ్గర మొదలవ్వాలి. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పురుష పిల్లలకు బాల్యంనుంచి స్త్రీల పట్ల గౌరవం, సమానత్వం, మానవ విలువలు నేర్పాలి.

బాలికలకు, స్త్రీలకు ‘భయంతో బ్రతుకు’ అని చెప్పే సమాజం కాదు, ‘నీకు భయం లేని జీవితం హక్కు’ అని చెప్పే సమాజాన్ని మనం నిర్మించాలి. ఉన్నావ్ బాధితురాలు ఒక్క వ్యక్తి కాదు. ఆమె ఈ దేశంలోని కోట్ల మంది మహిళల గాయాలకు ప్రతిరూపం. ఆమె తండ్రి ఈ వ్యవస్థ చేతిలో న్యాయం పొందలేక చనిపోయిన దేశ పౌరుడి ప్రతీక. ఈ దేశ భవిష్యత్తు   ప్రజల నిరంతర పోరాటంలోనే ఉంది. 

పి. రేణుక భూంపల్లి