విద్యా రంగంలో ఏఐ విప్లవంతో.. పొంచి ఉన్న ముప్పు.. స్టూడెంట్స్ డిజిటల్ బానిసలుగా మారే ప్రమాదం

విద్యా రంగంలో ఏఐ విప్లవంతో.. పొంచి ఉన్న ముప్పు.. స్టూడెంట్స్ డిజిటల్ బానిసలుగా మారే ప్రమాదం

కృత్రిమ మేధస్సు విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను ఇస్తూనే, వారి మేధో సామర్థ్యాలపై దాడి చేస్తోంది. గతంలో కంప్యూటర్లు కేవలం సమాచారాన్ని భద్రపరిచే సాధనాలుగా మాత్రమే పనిచేసేవి కానీ నేడు అవి మనుషుల వలె సృజనాత్మకంగా ఆలోచిస్తూ క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తున్నాయి. తరగతి గదుల నుండి పరిశోధనా కేంద్రాల వరకు ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం వెనుక ఒక గంభీరమైన మేధో సంక్షోభం పొంచి ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులలో సహజంగా ఉండాల్సిన మేధో కండరాలు లేదా కాగ్నిటివ్ మస్కులేచర్​ల  నేడు సమాజం ముందున్న అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది.

శాస్త్రవేత్తలు దీనిని ఆటోమేషన్ వైపరీత్యం లేదా ఐరనీ ఆఫ్ ఆటోమేషన్ అని పిలుస్తున్నారు. సాంకేతికత ఎంతగా సాయం చేస్తే, మనిషి అంతగా తన నైపుణ్యాన్ని కోల్పోవడమే ఈ ఆటోమేషన్ వైపరీత్యం. సాధారణంగా ఆటోమేషన్ అనేది మనిషి శ్రమను తగ్గించి ఉత్పాదకతను పెంచాలి. కానీ విద్యా రంగంలో ఇది విరుద్ధమైన ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టాల్సిన ప్రాథమికపాఠాలను సైతం ఏఐకి అప్పగించి, విజ్ఞాన సముపార్జనలో అడ్డదారులు తొక్కుతున్నారు.

వ్యాయామంలేని శరీరం ఎలాగైతే మొద్దుబారుతుందో, ఏఐపై అతిగా ఆధారపడే మెదడు కూడా తన మేధో కండరాల పటుత్వాన్ని కోల్పోయి నిశ్చేష్టమవుతుంది. విద్యార్థులు తమ అసైన్‌‌మెంట్లు, ఇతర సమస్యలకు పరిష్కారాలను, వ్యాసాలను ఏఐ టూల్స్ ద్వారా సులభంగా పొందుతున్నారు. దీనివల్ల వారు ఒక పనిని కేవలం పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతున్నారు తప్ప ఆ ప్రక్రియ వెనుక ఉన్న తర్కాన్ని లేదా లోతైన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఈ పద్ధతి విద్యార్థులను కేవలం యంత్రాల పర్యవేక్షకులుగా మారుస్తోంది తప్ప వారిని సృజనాత్మక ఆలోచనాపరులుగా తీర్చిదిద్దడం లేదు.

జ్ఞాపక శక్తిపై ప్రభావం
మేధో కండరాల క్షీణతపై 2024-–25 మధ్యకాలంలో జరిగిన అంతర్జాతీయ న్యూరో ఇమేజింగ్ సర్వేలు ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. సొంతంగా కష్టపడి పరిశోధన చేసి రాసే విద్యార్థులతో పోలిస్తే కేవలం ఏఐ సహాయంతో ఫలితాలను పొందే విద్యార్థుల మెదడు పనితీరులో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. 

ఏఐ అందించే సిద్ధంగా ఉన్న సమాచారాన్ని విద్యార్థులు నేరుగా వాడుకోవడం వల్ల, మెదడులో సమాచార విశ్లేషణకు అవసరమైన న్యూరల్ కనెక్షన్లు ఏర్పడటం లేదు. ఫలితంగా జ్ఞాపకశక్తి మందగిస్తోంది. ఏఐ ఇచ్చే సారాంశాలపైనే అందరూ ఆధారపడటం వల్ల విద్యార్థుల ఆలోచనలలో వైవిధ్యం కనుమరుగవుతోంది. దీనినే నిపుణులు  కన్వర్జెన్స్ ఆఫ్ థాట్ అని పిలుస్తారు. అందరి ఆలోచనలు ఒకే మూసలో సాగడం వల్ల వ్యక్తిగత విశ్లేషణ,  సందర్భోచిత తీర్పులు ఇచ్చే సామర్థ్యం నశిస్తుంది. 

సంప్రదాయ విద్యా విధానంలో  కేవలం మార్కుల కోసమే కంఠస్థం చేసే పద్ధతి ఉండటం వల్ల ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని కూడా విద్యార్థులు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఆలోచనా శక్తికి గండి పడి విద్యార్థి తన సొంత మేధో సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి సాంకేతికతపై అధిక విశ్వాసం ఉంచినప్పుడు ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. ఇది వారిని స్వతంత్రంగా సమస్యలను పరిష్కరించలేని స్థితికి నెడుతుంది. చివరకు వారు సాంకేతికతపై పూర్తిగా ఆధారపడే డిజిటల్ బానిసలుగా మారే అవకాశముంది. 

అభ్యాస ప్రక్రియలో విద్యార్థులు కేవలం సమాచారాన్ని స్వీకరించే వారుగా కాకుండా విజ్ఞానాన్ని నిర్మించే వారిగా ఉండాలి. కానీ ఏఐ వినియోగం ఈ నిర్మాణ ప్రక్రియను దెబ్బతీస్తోంది. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టే అవకాశాలను కోల్పోతున్నారు. దీనివల్ల వారిలో తార్కిక విశ్లేషణ చేసే శక్తి తగ్గిపోతోంది.

బోధనా పద్ధతుల్లో మార్పులు
ఈ మేధో సంక్షోభాన్ని అధిగమించాలంటే విద్యా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు రావాలి. ఏఐని కేవలం ఒక ప్రత్యామ్నాయంగా కాకుండా మానవ మేధస్సుకు ఒక మద్దతు ఇచ్చే సాధనంగా మలచుకోవాలి. విద్యా సంస్థలు విద్యార్థులను ఏఐ సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, దానిని విశ్లేషించి, సరిచూసి, తన సొంత పరిశోధనతో జోడించే ఒక సమగ్ర పద్ధతిని అలవర్చాలి. అంటే విద్యార్థులు ఏఐని కేవలం హోంవర్క్ పూర్తి చేయడానికి కాకుండా కష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక నిచ్చెనలా వాడుకోవాలి.

మేధస్సుకే అగ్రతాంబూలం
కృత్రిమ మేధస్సు అనేది మనిషి ఆలోచనల నుండి పుట్టిన ఒక అద్భుతమైన సృష్టి. అది మన విజ్ఞాన పరిధిని విస్తరించాలే తప్ప మన మెదడును స్తంభింపజేయకూడదు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలు ఏఐని విద్యా రంగంలో భాగం చేస్తున్నప్పుడు విద్యార్థుల మేధో కండరాలు బలహీనపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఏఐని ఒక బానిసలా కాకుండా, తమ మేధో పరిధులను విస్తరించే శక్తిగా మార్చుకోవాలి.

సాంకేతికత ఎంత ఎదిగినా, సృజనాత్మకత,  నైతికత అనేవి మానవ మేధస్సుకే సొంతమని గుర్తుంచుకోవాలి. మానవ మేధస్సుకి కృత్రిమ మేధస్సు మధ్య సరైన సమతుల్యత కుదిరినప్పుడే విద్యా రంగంలో నిజమైన అభ్యుదయం సాధ్యమవుతుంది. భవిష్యత్ తరాలు సాంకేతికతను శాసించే స్థాయికి ఎదగాలి తప్ప దానికి లొంగిపోయే స్థితికి చేరకూడదు. మేధో దృఢత్వం కలిగిన విద్యార్థులే రేపటి ప్రపంచానికి అసలైన నాయకులుగా నిలుస్తారు.

ఉపాధ్యాయుల పాత్ర
ఉపాధ్యాయులు కూడా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పాత్రను మార్చుకోవాలి. వారు కేవలం సమాచారాన్ని అందించే వారుగా కాకుండా విద్యార్థుల మేధో మార్గదర్శకులుగా వ్యవహరించాలి. ఏఐ వల్ల కలిగే ముప్పుల గురించి విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పించాలి. అలాగే పాఠ్యపుస్తకాల్లో సాంకేతికతతో పాటు డిజిటల్ ఎథిక్స్, సొంతంగా ఆలోచించడంలోని గొప్పతనాన్ని వివరించే పాఠాలను చేర్చాలి. అప్పుడే విద్యార్థులలో నైతిక స్పృహ పెరుగుతుంది. 

డా. శ్రీనివాస్​ కట్కూరి, సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు