బషీర్బాగ్, వెలుగు: ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే విజయ యాత్రను ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్‌ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరించనున్నట్లు వెల్లడించారు.
నిర్వాహకులు వలంటీర్లకు శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తుగా మళ్లింపులు అమలు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమావేశం అనంతరం సీపీ గౌలిగూడ రామమందిరాన్ని దర్శించి, అక్కడి నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఎల్ అండ్ వో తఫ్సీర్ ఇకుబాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ డి.జోయల్ డేవిస్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సిరవి కిరణ్, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహా మూర్తి, నేషనల్ మత్‌మందిర్ అధ్యక్షుడు రామరాజు, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీకాంత్, విహెచ్‌పీ ప్రతినిధి శశిధర్, సైబరాబాద్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, మల్కాజ్‌గిరి కమిషనరేట్ డీసీపీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
