పక్కా ఇంటర్నేషనల్..! నగరాభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రణాళిక

పక్కా ఇంటర్నేషనల్..! నగరాభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రణాళిక

 

  • నిర్మాణ రంగంలో సమూల మార్పులకు ఎల్ఏడీపీ
  • ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్​కు అనుగుణంగా విధివిధానాలు
  • దీనికి తోడు మరో మూడు మాస్టర్​ప్లాన్ల మ్యాపింగ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: ట్రిపుల్​ఆర్​వరకూ విస్తరిస్తున్న హైదరాబాద్​నగరాన్ని ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్ ​ప్రకారం డెవలప్​చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణ రంగంలో సమూల మార్పులు చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో బిల్డింగ్ కన్​స్ట్రక్షన్​రంగానికి దిశానిర్దేశం చేసేందుకు లోకల్​ఏరియా డెవలప్​మెంట్​ప్లాన్​(ఎల్ఏడీపీ)ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధివిధానాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఎల్ఏడీపీని రూపుదిద్దే పనులు ఒక కన్సల్టెన్సీకి అప్పగించనున్నట్టు సమాచారం. ఎల్ఏడీపీ అమలులోకి వస్తే హెచ్ఎండీఏ లేఅవుట్లతో పాటు, ప్రైవేట్ ​లేఅవుట్స్, వెంచర్లలో తప్పనిసరిగా రోడ్లు, ఇతర సదుపాయాలు ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్​కు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భూసేకరణ నుంచి మొదలుకుంటే టౌన్​షిప్​ల నిర్మాణం వరకు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. 

మెగా మాస్టర్​ప్లాన్​–2050లో భాగంగా ఈ ఎల్ఏడీపీని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్​ వెలుపల ఉన్న  ప్రాంతాలు నగరీకరణకు నోచుకోవడం లేదు. భవిష్యత్​లో వాటి రూపురేఖలు మారే అవకాశం ఉన్నందున ఎల్ఏడీపీ కీలకం కానున్నది. 

డిసెంబర్​నాటికి మూడు ప్లాన్లు పూర్తి  

హెచ్ఎండీఏ మెగా మాస్టర్​ప్లాన్​–2050లో భాగంగా ప్రతిపాదించిన మూడు ప్లాన్ల మ్యాపింగ్​పనులను కూడా చేపట్టాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందులో కామన్​మొబిలిటీ ప్లాన్​ (సీఎంపీ), స్పెషల్​ఎకానమికల్​ డెవలప్​మెంట్​ ప్లాన్​, బ్లూ అండ్​గ్రీన్​ ఏరియా ప్లాన్ల మ్యాపింగ్​ తుదిదశకు చేరుకున్నాయి. సెప్టెంబర్​ నుంచి మ్యాపింగ్​ పనులు చేపట్టి డిసెంబర్​నాటికి ఈ ప్లాన్లను కంప్లీట్​ చేయనున్నారు.  

రైతులకు 60 శాతం

ట్రిపుల్​ఆర్​వరకూ నగర పరిధి విస్తరించినప్పటికీ అనేక ప్రాంతాలు ఇంకా నగరీకరణకు దూరంగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భవిష్యత్​అవసరాలకు అనుగుణంగా టౌన్​షిప్​లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఔటర్​నుంచి ట్రిపుల్​ఆర్​వరకు రేడియల్​రోడ్లు, టౌన్​షిప్​లు అందుబాటులోకి వచ్చే చాన్స్​ఉంది. 

ఇందులో భాగంగా నగరీకరణకు దూరంగా ఉన్న గ్రామాల్లో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం వారికి, మరో 40 శాతం హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ఇందులో 30 శాతం రోడ్లు, పార్కులు, దవాఖానలు, స్కూళ్లు, కాలేజీలు, విద్యుత్​ కేంద్రాలకు కేటాయిస్తారు. 10 శాతం హెచ్ఎండీఏ ల్యాండ్​బ్యాంక్​అవసరాలకు వినియోగిస్తారు. ఈ  మేరకు త్వరలో కాంప్రహెన్సీవ్​ ల్యాండ్​పూలింగ్​ పాలసీ కూడా తీసుకురానున్నారు.

ఏ ప్లాన్​ ఎందుకోసం ? 

కామన్​ మొబిలిటీ ప్లాన్​లో భాగంగా ట్రిపుల్​ఆర్​వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్​సదుపాయాలను అధ్యయనం చేసి భవిష్యత్​ అవసరాల మేరకు ఏ ప్రాంతంలో ఏ విధమైన ప్రజా రవాణా అవసరమనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. అలాగే స్పెషల్​ఎకానమికల్​డెవలప్​మెంట్​ప్లాన్​(ఎస్​ఈడీపీ)లో భాగంగా పారిశ్రామిక, లాజిస్టిక్​ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు.

 ట్రిపుల్ ఆర్​వరకు నీటి వనరులు, అడవులను గుర్తించేందుకు బ్లూ అండ్​గ్రీన్​ప్లాన్​పై దృష్టి పెట్టారు. 2050 వరకు హైదరాబాద్​అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు ప్లాన్లపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇందు కోసం త్వరలో కన్సల్టెన్సీలను నియమించనున్నది.