
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సమయం రెండు గంటలు పెరిగింది. ఇప్పటివరకు 12 గంటల వరకే ఉన్న ఓపీ మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 110 ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. ఓపీతో పాటు డయాగ్నస్టిక్స్ సమయాన్నీ పొడిగించారు. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకే రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా మరో 2 గంటలు పొడిగించారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈవినింగ్ ఓపీ (సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు) అంశాన్ని పరిశీలిస్తున్నారు. కానీ ఈవినింగ్ ఓపీ పెడితే డయాగ్నస్టిక్స్ టైమింగ్స్ కూడా పొడిగించాల్సి ఉంటుంది. డాక్టర్లు, సిబ్బంది పనివేళల్లో మార్పు చేయాల్సి ఉంటుంది. డాక్టర్లు, సిబ్బంది కొరత ఉండటంతో ఈవినింగ్ ఓపీ సాధ్యాసాధ్యాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.