హైదరాబాద్ అంతా కేసీఆర్, కేటీఆర్ హోర్డింగ్​ల మయం

హైదరాబాద్ అంతా కేసీఆర్, కేటీఆర్ హోర్డింగ్​ల మయం

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​లోని మెట్రో పిల్లర్లు, హోర్డింగ్​లను రాష్ట్ర సర్కార్ ప్రకటనలతో ముంచెత్తుతున్నది. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాల ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. వారం రోజుల పాటు ఈ ప్రచార హోరు కొనసాగనుంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు  ఖర్చు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ సభ జరగనున్న రోజుల్లో ఆ పార్టీకి సరైన ప్రచారం లభించకుండా ఈ ఎత్తుగడ వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలకు అవకాశం లేకుండా చేసేందుకే ఈ యాడ్స్​ పెడుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో మొత్తం 2599  వరకు మెట్రో పిల్లర్లు ఉండగా వీటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే యాడ్​ఏజెన్సీలను సంప్రదించి ఆన్​లైన్​లో అన్ని హోర్డింగ్​లను జులై 4వ తేదీ వరకు బుక్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలు బేగంపేట ఎయిర్ పోర్ట్, రాజ్ భవన్ పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ ఐ సీసీ నోవాటెల్ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ స్కీమ్​ల హోర్డింగ్​లు పెట్టారు. 

ఇప్పుడేం చేస్తరో?

జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు రెండు రోజుల పాటు సిటీలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో హోర్డింగ్​లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్​పై పోలీసులు, జీహెచ్​ఎంసీ అధికారులు దాడులు చేసి కేసులు బుక్ చేసి, జరిమానా విధించారు. ఇపుడు బీజేపీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలపై అధికారులు, పోలీసుల తీరు ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతోంది. 

బీజేపీ సీఎంలు బస చేసే పలు హోటళ్ల దగ్గర..

మిగతా ప్రాంతాలనూ వీటితో నింపే పనిలో ఉన్నారు. బీజేపీ సీఎంలు బస చేసే పలు హోటళ్ల దగ్గర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ఇతర పార్టీలు ప్రచారం చేసుకునేందుకు స్పేస్ దక్కకుండా అంతా తామే బుక్ చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వ పథకాల పేరుతో బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నది. 

ప్రతిపక్షాల ఫ్లెక్సీలపై చర్యలు

ప్రతిపక్ష పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కొరడా పట్టుకొనే జీహెచ్‌‌ఎంసీ అధికారులు అధికార పార్టీ ఫ్లెక్సీలపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను కట్టడి చేసేందుకు బల్దియా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ విభాగం ‘ఈ చాలన్‌‌ జనరేటర్‌‌ సిస్టం’ను తీసుకువచ్చింది. దీన్ని ప్రజలు నేరుగా వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ట్విట్టర్‌‌లో పెట్టే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నది. కానీ టీఆర్ ఎస్ ప్లీనరీ, సిటీలో కేటీఆర్ పర్యటనలు ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ విభాగం అధికారులు స్పందించడం లేదు.

బల్దియా అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు

ఏప్రిల్‌‌ 27న టీఆర్‌‌ఎస్‌‌ 21వ ప్లీనరీ, నిరుడు అక్టోబర్‌‌ 25న నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశం సందర్భంగా హైదరాబాద్​ను గులాబీ ఫ్లెక్సీలతో ముంచెత్తారు. ఆ సమయంలో ఈ చాలన్‌‌ జనరేటర్‌‌ సిస్టం సర్వర్‌‌ ప్రాబ్లం పేరుతో మూగబోయింది. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ విభాగం అధిపతిగా ఉన్న ఐపీఎస్‌‌ అధికారి విశ్వజీత్‌‌ కంపాటీ ఆ రెండు సందర్భాల్లోనూ సెలవులో వెళ్లారు. టీఆర్​ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌లపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఆయన సెలవులపై వెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో బల్దియా అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్‌‌లో పెట్టిన కంప్లైంట్లను పరిగణలోకి తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు నామమాత్రంగా జరిమానాలు వేశారు. ఇటీవల కేటీఆర్‌‌ కూకట్‌‌పల్లిలో ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా కూకట్‌‌పల్లి జంక్షన్‌‌ నుంచి కైత్లాపూర్‌‌ ఫ్లై ఓవర్‌‌ వరకు, బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాల్లోనూ భారీగా టీఆర్​ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే బల్దియా అధికారులు ఎప్పట్లాగే దీనిపై సైలెంట్​గా ఉండిపోయారు.