సిటీపై పట్టు.. అనుభవానికి చోటు ..హైదరాబాద్ కొత్త సీపీగా వీసీ సజ్జనార్.. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ బదిలీ

సిటీపై పట్టు.. అనుభవానికి చోటు ..హైదరాబాద్ కొత్త సీపీగా వీసీ సజ్జనార్..  ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ బదిలీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా టీజీఎస్​ఆర్టీసీ ఎండీ, 1996 బ్యాచ్​కు చెందిన సజ్జనార్​ నియమితులయ్యారు. ప్రస్తుతం సీపీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్​హోమ్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. టీజీఎస్​ఆర్టీసీ ఎండీగా 2021, సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ నాలుగేండ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టడంలో సక్సెస్ అయ్యారు.

 సజ్జనార్ పూర్తి పేరు విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్. ఆయన 1968 అక్టోబర్ 24న కర్నాటకలోని హుబ్బళ్లిలో జన్మించారు. లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్, జేజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బి.కామ్, కౌసలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1996లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) పరీక్షలో సక్సెస్ అయి ఏపీ క్యాడర్‌లో ఐపీఎస్‌గా చేరారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడే కొనసాగారు. ఆయనకు భార్య అనుప సజ్జనార్, ఇద్దరు పిల్లలున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసిన అనుభవం ఉంది. సజ్జనార్​కు హైదరాబాద్​నగరంతో అనుబంధం ఉంది. కెరీర్ మొదట్లో సజ్జనార్ జనగామ (ఉమ్మడి వరంగల్ జిల్లా) ఏఎస్​పీ గా పని చేశారు. అలాగే, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ), స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా మావోయిస్ట్ కార్యకలాపాలను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు. మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్న టైంలో వారి నేతృత్వంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా రక్షణాత్మక వ్యూహాలు రూపొందించారు.

దిశ ఘటన కూడా సంచలనమే..

2019 నవంబర్ 27న జరిగిన దిశా (వెటర్నరీ డాక్టర్) గ్యాంగ్‌ రేప్- మర్డర్ కేసులో నలుగురు నిందితులు ఎన్​కౌంటర్​లో మరణించారు. అప్పుడు సైబరాబాద్​సీపీగా సజ్జనార్​ ఉన్నారు. ఘటన జరిగిన ఎనిమిది రోజుల్లోనే నలుగురు నిందితులు ఎన్​కౌంటర్​కావడంతో సజ్జనార్​పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దేశవ్యాప్తంగా సజ్జనార్​ను హీరోగా చూశారు. అదే సమయంలో ప్రజాస్వామిక వాదులు ఆయన చర్యను తప్పుబట్టారు. 

ఎన్‌హెచ్-44లో క్రైమ్ స్పాట్ సమీపంలోనే జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌కు సమాజం మద్దతు ఇచ్చింది, కానీ హ్యూమన్ రైట్స్ గ్రూపులు విమర్శలు చేశాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు 2021లో విచారణకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీగా సేవలందిస్తున్న సజ్జనార్​పై నమ్మకం ఉంచిన సర్కారు ఆయనకు కీలకమైన సిటీ కమిషనర్​గా బాధ్యతలు అప్పగించింది.

వరంగల్ ​ఎన్​కౌంటర్​తో వార్తల్లోకి..

2008లో వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు, ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడి ఘటన..తర్వాత ముగ్గురు నిందితుల ఎన్​కౌంటర్​సంచలనం సృష్టించింది. నిందితులు క్రైమ్ సీన్ రీక్రియేషన్ టైంలో ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేశారని, ఆ క్రమంలో పోలీసులపై దాడి చేయబోగా ఆత్మరక్షణార్థం కాల్పులు జరపగా చనిపోయారని సజ్జనార్​ప్రకటించారు. 

ఈ ఘటనపై ఆయనకు అభినందనలతో పాటు పౌరహక్కుల సంఘం నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఘటనతో ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ అనే ట్యాగ్ సజ్జనార్‌కు వచ్చింది. 2018 మార్చిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులై, క్రైమ్ రేట్‌ను తగ్గించే అనేక చర్యలు తీసుకున్నారు.