హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..రోప్వేలు వస్తున్నయ్.. టూరిజాన్ని అభివృద్ది చేస్తాం..

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..రోప్వేలు వస్తున్నయ్.. టూరిజాన్ని అభివృద్ది చేస్తాం..

 

  • ముందు గోల్కొండ నుంచి  కుతుబ్​షాహి టూంబ్స్​వరకు
  • తర్వాత ట్యాంక్​బండ్,  మీరాలం ట్యాంక్ ​వద్ద  ఏర్పాటు 
  • టూరిజం డెవలప్​మెంట్, ట్రాఫిక్ సమస్యలకు చెక్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో టూరిజం డెవలప్​చేయడానికి, ట్రాఫిక్​ సమస్య పరిష్కారానికి యూనిఫైడ్​మెట్రోపాలిటన్ ​ట్రాన్స్​పోర్ట్​ అథారిటీ(ఉమ్టా) అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పర్యాటక శాఖతో కలిసి నగరంలోని టూరిస్టు ప్రాంతాల్లో రోప్​వే ఏర్పాటు చేయాలని ప్లాన్​చేస్తున్నారు. 

బాక్స్​లాంటి వాహనంలో తీగలపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేలా రోప్​వే నిర్మాణం ఉంటుంది. ఒక్కో బాక్స్​లో ఆరు నుంచి పది మంది ప్రయాణిస్తారు. గ్రేటర్​లో ట్రాఫిక్​సమస్య తీవ్రంగా వేధిస్తుండడంతో దీన్ని అధిగమించడం, విదేశీయులను, ఇతర రాష్ట్రవాసులను ఆకట్టుకోవడానికి ఈ ప్రాజెక్టుకు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్టా ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. గతంలోనూ ఈప్రాజెక్టుపై చర్చ జరిగినా అమల్లోకి రాలేదు. తాజాగా నగరం విస్తరిస్తుండడం, పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

ముందు అక్కడే.. 

రోప్​వే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ముందు గోల్కొండ–కుతుబ్​షాహి టూంబ్స్​మధ్య నిర్మించాలని భావిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతాలకు రోజూ వందలాది మంది దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో రోజూ ట్రాఫిక్​ ఎక్కువగానే ఉండడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటారు.

 కానీ రోప్​వే నిర్మాణం జరిగితే గోల్కొండను విజిట్ ​చేసిన వారు నేరుగా ఆకాశ మార్గాన కుతుబ్​షాహి టూంబ్స్​కు చేరుకోవచ్చు. అయితే, ఇక్కడ మిలిటరీ ప్రాంతం ఉండడం వల్ల అలైన్ మెంట్​ఎక్కడి నుంచి తీసుకోవాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్​అయితే, సంజీవయ్య పార్కు, ట్యాంక్​బండ్​, మీరాలం ట్యాంక్​, కొత్వాల్​గూడ వద్ద నిర్మించిన ఎకో పార్క్​వద్ద కూడా ఈ రోప్​వేలను నిర్మించాలని చూస్తున్నారు.