3 జోన్లుగా వాటర్ బోర్డు..ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్లుగా మార్పు

3 జోన్లుగా వాటర్ బోర్డు..ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్లుగా మార్పు
  • 60 సర్కిళ్లుగా 23 డివిజన్లు
  • 300 వార్డులు కానున్న 100 సెక్షన్లు  
  • జాయింట్​ ఎండీగా ‘ఈడీ’  
  • సర్కారుకు ప్రతిపాదనలు.. త్వరలో నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  బల్దియాలో శివారు ప్రాంతాల విలీనం నేపథ్యంలో వాటర్ బోర్డును కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ మాదిరిగానే బోర్డును కూడా మూడు ప్రధాన జోన్లుగా విభజించనున్నది. ప్రస్తుతం గ్రేటర్​లో 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తుండగా, 2030 నాటికి 850 ఎంజీడీల వరకు డిమాండ్​ పెరుగుతుందని అంచనా వేస్తోంది. 

అంతే కాకుండా బోర్డు ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులు కూడా రానున్నాయి. ఇప్పటికే గోదావరి రెండో, మూడో దశ పనులు ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే మరో 350 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా బోర్డు పునర్విభజనకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అంఈదజేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్​సిగ్నల్​ రాగానే బోర్డు రూపు రేఖలు మార్చివేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 

మూడు జోన్లుగా ఏర్పాటుకు ప్రతిపాదనలు

జీహెచ్ఎంసీ మాదిరిగానే పూర్తిస్థాయిలో మెట్రోవాటర్​బోర్డును పునర్విభజన చేయనున్నారు. దీనికి సంబంధించి వాటర్​బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం బోర్డును మూడు ప్రధాన జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఈస్ట్​, వెస్ట్​, సెంట్రల్​ జోన్లుగా ఏర్పాటు చేసి ప్రధాన కార్యాలయం నుంచే పరిపాలన వ్యవహారాలను ఎండీ పర్యవేక్షణ చేయనున్నారు. 

మూడు ప్రధాన జోన్లలో ఒక్కో జోన్​ పరిధిలో మరో నాలుగు సబ్ జోన్లు రానున్నాయి. అంటే ప్రస్తుతం జీహెచ్​ఎంసీ మాదిరిగానే ఇందులోనూ 12 జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న 23 డివిజన్లను 60 సర్కిళ్లుగా చేస్తారు. ప్రస్తుతం ఉన్న 100 సెక్షన్లను 300 వార్డులు చేయనున్నారు. ప్రధాన జోన్లలో ఈస్ట్​జోన్​ను ఎల్​బీ నగర్​ లేదా సాహెబ్​ నగర్​ను కేంద్రంగా పని చేయనున్నది.

 వెస్ట్​ జోన్​ హైదర్​నగర్​ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్​ జోన్​గా ప్రస్తుతం ఉన్న ఖైరతాబాద్​ఆఫీసును లేదా ఎస్ఆర్​నగర్​లోని ఆఫీసును ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతమున్న డివిజన్లను సర్కిళ్లుగా మార్చనున్నారు. ఒక్కో ప్రధాన జోన్​పరిధిలో 5 నుంచి 7 సర్కిళ్లను కలుపనున్నారు. ఒక్కో సర్కిల్​ పరిధిలో 17 నుంచి 29 వార్డులు ఏర్పాటు చేస్తారు. 

ఈడీ పోస్ట్​ అప్​గ్రేడ్​

ప్రస్తుతమున్న  ఈడీ పోస్టును అప్ గ్రేడ్ చేసి జాయింట్ ఎండీగా కొనసాగిస్తారు. ఒక్కో ప్రధాన జోన్ లో ఈడీ, ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​ డైరెక్టర్లు ఉంటారు. ఈ మేరకు కొత్తగా మూడు ఈడీ పోస్టులకు ప్రభుత్వానికి నివేదించారు. ఇలా పూర్తిస్థాయిలో మెట్రోవాటర్​బోర్డును పునర్విభజన చేయడం ద్వారా బల్దియా విస్తరిత ప్రాంతాలన్నింటిలోనూ వాటర్​బోర్డు ద్వారా తాగునీరు, మురుగునీటి వ్యవస్థను 
నిర్వహించనున్నారు. 

 12 సబ్​జోన్​లు ఇవే.. 

వాటర్​బోర్డు ఏర్పాటు చేసే మూడు ప్రధాన జోన్లలో ఒక్కో జోన్​ పరిధిలో నాలుగేసి సబ్​ జోన్​లు ఏర్పాటు కానున్నాయి. ఈ సబ్​జోన్​ల కింద సర్కిళ్లు, సర్కిళ్ల పరిధిలో వార్డు కార్యాలయాలు పని చేస్తాయి. 

సబ్​జోన్​లు    సర్కిళ్లు    వార్డులు
1.మల్కాజిగిరి      5                26
2.ఉప్పల్​             5                24
3.ఎల్​బి నగర్​      4                24
4.శంషాబాద్​        4                 17
5.రాజేంద్ర నగర్    6              29
6.చార్మినార్​          5               25
7.గోల్కొండ          5                26
8.ఖైరతాబాద్​        5               25
9.సికింద్రాబాద్​    5                28
10.శేరిలింగంపల్లి 5               26
11.కూకట్​పల్లి       4               23
12.కుత్బుల్లాపూర్​   7            27