
సైబర్ నేరగాళ్లకు తన మన అనే భేదం ఉండదు. సొంతవాడు కానీ..పరాయి వాడు కానీ..వారి టార్గెట్ డబ్బులు దోచుకోవడమే. తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని టార్గెట్ చేసి అందినకాడికి నొక్కేశారు. మాయమాటలు చెప్పి..నగదును కొట్టేశారు. ఈ ఘటన మన తెలంగాణలో జరిగింది. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల వలలో పడి భారీగా నగదు పోగొట్టుకున్నాడు.
హైదరాబాద్లోని ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో శ్రీధర్ రావు దేశ్ పాండే ఇరిగేషన్ ఓఎస్డీగా పనిచేస్తున్నాడు. శ్రీధర్ రావు ఇటీవల గూగుల్ లో బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేశాడు. ఓ నెంబర్ ను కనుగొని..ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి తాను బ్యాంక్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అంటూ శ్రీధర్ దగ్గర నమ్మబలికాడు. దీంతో అపరిచిత వ్యక్తి దగ్గర శ్రీధర్ రావు తన సమస్యను చెప్పుకున్నాడు. తమ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన సైబర్ నేరగాడు..ఓ లింక్ ను శ్రీధర్ రావుకు పంపాడు. అది క్లిక్ చేయాలని సూచించాడు. సైబర్ నేరగాడు పంపిన లింక్ ను క్లిక్ చేసిన తర్వాత శ్రీధర్ రావు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని ఖాతాలో నుంచి రూ. 7 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన అక్టోబర్ 15వ తేదీన జరిగింది.
Also Read :- ఇలాంటి బెదిరింపు రాజకీయాలను నిజాం టైంలో కూడా చూడలేను
తన ఖాతాలో నుంచి ఒక్కటే సారి రూ. 7 లక్షలు పోవడంతో షాక్ అయిన శ్రీధర్ రావు..వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. రూ. 7లక్షల్లో రూ. 3 లక్షలను సైబర్ క్రైం పోలీసులు నిలిపివేశారు. మిగిలిన మొత్తం నిందితుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది.