ప్రభుత్వ భూముల రక్షణకు యాప్ రూపొందించాలి : హైదరాబాద్ కలెక్టర్

ప్రభుత్వ భూముల రక్షణకు యాప్ రూపొందించాలి : హైదరాబాద్ కలెక్టర్

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తించాలని, శాఖకు మంచి పేరు తేవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో తహసీల్దార్ ఆఫీసుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్​మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, పరిష్కారాల తేదీలను నమోదు చేయాలన్నారు. రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్​చేయాలని సూచించారు. కలెక్టరేట్, ప్రజాభవన్​ప్రజావాణిలకు అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించొద్దని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, క్యాస్ట్, ఇన్​కమ్​సర్టిఫికెట్ల జారీని లేట్​చేయొద్దని ఆదేశించారు. 

గత నెల 4 నుంచి ఈ నెల 4 వరకు మీసేవల ద్వారా తహసీల్దార్లకు క్యాస్ట్, ఇన్​కమ్, రెసిడెన్స్, ఈబీసీ, ఓబీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం 14,195 అర్జీలు రాగా 8,111 సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. నాయబ్ తహసీల్దార్లకు 19,299 అర్జీలు రాగా 16,665 పరిష్కరించామని చెప్పారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు ‘ల్యాండ్ బ్యాంక్ యాప్’ రూపొందించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడెక్కడ ఎంతెంత ప్రభుత్వ భూమి ఉందనే వివరాలు అందులో నమోదు చేయాలని, ల్యాండ్ బ్యాంక్ రిజిస్టర్ ను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేయాలని సూచించారు. 

ప్రభుత్వం ఇచ్చిన భవనాలు వినియోగంలో లేకుంటే, ప్రభుత్వం భూముల్లో పనులు చేపట్టకపోతే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతివారం తహసీల్దార్​ఆఫీసుల తనిఖీ కోసం నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు. వానల టైంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, స్థానిక తహసీల్దార్, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు లోతట్టు ప్రాంతాలను సందర్శించాలని స్పష్టం చేశారు.

 అడిషనల్​కలెక్టర్ కదిరవన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీఓలు మహిపాల్,  దశరథ్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. తెలంగాణ తొలి యోధుడు దొడ్డి కొమురయ్య అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొమురయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులార్పించారు.