- దీనిని భావితరాలకు అందించాలి
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలోని బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. 18 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైపోయిందని, గతేడాది ఆగస్టు నెలలోనే ఈ ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇప్పుడు చెరువును 18 ఎకరాల మేర విస్తరించి, వరద కట్టడితోపాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. చెరువులోకి వరద నీరు చేరేలా.. నిండితే పోయేలా నిర్మించిన ఇన్లెట్‌లు, ఔట్లెట్లను కమిషనర్ పరిశీలించారు. చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్, చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు, వృద్ధులు సేద దీరే విధంగా సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు నిర్మిస్తున్నామన్నారు.
ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, చెరువు చుట్టూ రహదారులు నిర్మించడంతో పాటు గ్రీనరీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుతూ.. మరింత పటిష్టం చేస్తున్నామన్నారు.
