
శంషాబాద్, వెలుగు: చిట్టీల పేరుతో రూ.5 కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ డబ్బులతో పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని ఆర్బీనగర్ కు చెందిన పల్లెమోని సురేందర్, అతని భార్య కవిత 25 ఏండ్లు చిట్టీలు నిర్వహిస్తున్నారు. స్థానికులు చాలామంది వారి వద్ద చిట్టీలు వేశారు. చిట్టీ లిఫ్ట్చేసినవారికి మూడు, నాలుగు నెలలుగా సురేందర్డబ్బులు ఇవ్వడం లేదు. తన ఆస్తులను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించాడు. ఇంటిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడు.
చిట్టీలు వేసినవారి నుంచి ఒత్తిడి పెరగడంతో పథకం ప్రకారం.. రూ.5 కోట్లతో దంపతులు ఉడాయించారు. 15 రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో బాధితులు సురేందర్‌కు ఫోన్చేస్తున్నారు. అతను శ్రీశైలంలో ఉన్నాను, బయట ఉన్నాను, ఒకటి రెండు రోజుల్లో వస్తానని, డబ్బులు ఇస్తానని చెబుతున్నాడు. కానీ రావడం లేదు. దీంతో బాధితులు లబోదిబోమంటూ శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. సురేందర్బ్యాంక్అకౌంట్లను ఫ్రీజ్ చేయించామని, ఇంటిని విక్రయించకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.