పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 

పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 

పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు మార్మోగిన విషయం తెలిసిందే. ఓ ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్ కి వేదిక చేసుకోవటమే అందుకు కారణం. పైగా ఈ జంట పోలీసు యూనిఫాంను,  పెట్రోలింగ్ వాహనాలను కూడా షూట్‌లో వాడేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయంపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు  వ్యక్తం అవుతుండటంతో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. 

పోలీస్ దంపతులు ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ముందుస్తు అనుమతి తీసుకోలేదన్న సీపీ.. ఒకవేళ ముందే తెలియజేసి ఉంటే ఖచ్చితంగా షూట్‌కి అనుమతించేవాళ్లం అని తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు అవ్వడం వల్ల పోలీసు డిపార్ట్‌మెంట్ ఆస్తులు, చిహ్నాలను ఉపయోగించడంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని తెలిపారు.

"పోలీస్ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. నిజానికి, పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో వారిద్దరూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. గొప్ప విషయమే కావొచ్చు.. కానీ, కొంచెం ఇబ్బందిగానే ఉంది. పోలీసు ఉద్యోగం చాలా కష్టమైన పని.. అందునా మహిళలకు ఇంకా కష్టం. ఇద్దరు పోలీసు అధికారులు వివాహ బంధంతో ఒక్కటవ్వడం ఖచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. పోలీసు అధికారులు అవ్వడం వల్ల పోలీసు డిపార్ట్‌మెంట్ ఆస్తులు, చిహ్నాలను ఉపయోగించడాన్ని నేను తప్పుబట్టడం లేదు." 

"కాకపోతే వారు ఈ విషయాన్ని మాకు ముందే తెలియజేసి ఉంటే ఖచ్చితంగా షూట్‌కి అనుమతించే వాళ్లం. వారు చేసిన ఈ పని కొందరికి ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు. వారు నన్ను పెళ్లికి పిలవపిలవనప్పటికీ, వెళ్లి వారిద్దరినీ కలిసి ఆశీర్వదించాలని ఉంది. ఏదేమైనా మున్ముందు సరైన అనుమతి లేకుండా ఇలాంటివి పునరావృతం చేయవద్దని నేను ఇతరులకు సలహా ఇస్తున్నాను.." సీపీ సున్నితంగా హెచ్చరించారు.