- పోలీసులు వసూళ్లు చేస్తే క్రిమినల్ కేసులు
- పెట్రోలింగ్ పక్కాగా నిర్వహించాలి
- రిపీటెడ్ నేరస్థులపై పీడీ యాక్ట్
- సజ్జనార్ కార్యక్రమాలు కొనసాగిస్తా: హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కొత్త సీపీ మహేష్ మురళీధర్ భగవత్ స్పష్టం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగులు, గ్రూపు తగాదాలు, ప్రతీకార దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ప్లాన్రూపొందిస్తామని తెలిపారు.
జైళ్ల నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై టీ-స్పార్క్, సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థల అనుసంధానంతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన వారిని మళ్లీ బైండోవర్ చేయడంతో పాటు ఆర్థిక పూచీకత్తు తీసుకుంటామని, నేరాల తీవ్రతను బట్టి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. వరుస నేరాలకు పాల్పడే వారితో పాటు డ్రగ్స్ రవాణా చేసే నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం
ముందుగా డీసీపీలు, ఏసీపీలతో సమావేశమై, తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లను విజిట్చేస్తానని సీపీ చెప్పారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో నేరాలు జరగకుండా సిబ్బంది పోలీస్ స్టేషన్లకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశిస్తామన్నారు. రాత్రి పెట్రోలింగ్ అమలుపై మరుసటి రోజు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. డయల్100, డయల్ 112కు వచ్చే ఫిర్యాదులపై పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వసూళ్లు చేస్తే క్రిమినల్ కేసులు
పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మహేశ్భగవత్హెచ్చరించారు. మన రాష్ట్రంలో ఏటా దాదాపు 8 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, యాక్సిడెంట్జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో స్పందించి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జాయింట్ సీపీ (ట్రాఫిక్)తో పాటు నూతనంగా ఏర్పాటైన టీ-మార్స్ వింగ్సమన్వయంతో పనిచేస్తుందని చెప్పారు.
వాళ్లతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్
చట్టాన్ని గౌరవించే పౌరులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. సిటీ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన సీవీ ఆనంద్, వీసీ సజ్జనార్ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో గతంలోనూ వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, అది ఉపయోగపడుతుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ జోన్ల డీసీపీలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాల అధికారులతో సమావేశమై నగరంలోని ప్రస్తుత పరిస్థితులు, సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
