బ్యాంకుల రూల్స్ మారితేనే సైబర్ నేరాలు తగ్గుతయ్

బ్యాంకుల రూల్స్ మారితేనే సైబర్ నేరాలు తగ్గుతయ్
  •  మ్యూల్ అకౌంట్ల కంట్రోల్​కు ఆర్బీఐ కఠినంగా ఉండాలి 
  • హైదరాబాద్​ సీపీ సజ్జనార్
  • ​    ఆర్బీఐ గవర్నర్​ను కలిసిన సీపీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారిన సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడానికి బ్యాంకింగ్ రూల్స్​లో సమూల మార్పులు అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. మ్యూల్ ఖాతాల నియంత్రణలో ఆర్బీఐ మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్‌ ఆర్బీఐ ఆఫీసులో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సజ్జనార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మోసాలపై చర్చించారు. సైబర్ నేరగాళ్లు అమాయక విద్యార్థులు, కూలీలకు రూ.2 వేల నుంచి రూ.5వేల కమీషన్ ఆశ చూపి వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరుస్తున్నారని ఆర్బీఐ గవర్నర్​దృష్టికి తీసుకువెళ్లారు. 

కొట్టేసిన సొమ్మును వెంటనే ఈ మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేస్తున్నారని చెప్పారు. మ్యూల్ ఖాతాల గుర్తింపునకు సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని, ఖాతాలు తెరిచేటప్పుడు జియో వెరిఫికేషన్, లైవ్ వీడియో కేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బ్యాంకులు సత్వర స్పందించాలని, అన్ని బ్యాంకులు ఒకే ఫార్మాట్‌లో స్టేట్‌మెంట్లు ఇవ్వాలని సూచించారు. డెబిట్, క్రెడిట్ వివరాలతోపాటు లావాదేవీల పూర్తి వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. డైరెక్ట్ సెల్లింగ్, మల్టీలెవెల్ మార్కెటింగ్ పేర్లతో జరుగుతున్న పిరమిడ్, పాంజీ స్కీమ్‌లపై ఈడీ, సీబీఐతో సమన్వయంతో ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో గవర్నర్ మల్హోత్రా సానుకూలంగా స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సజ్జనార్​మూడు లెటర్లను గవర్నర్​కు అందజేశారు. అడిషనల్​సీపీ (క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, సీసీఎస్ డీసీపీ శ్వేత, సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు పాల్గొన్నారు.