లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీపై హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడిన ధోనీకి అభిమానులు నీరాజనం పలికారు. మహీని చూసేందుకు శుక్రవారం ఉప్పల్ స్టేడియానికి వేలాదిగా తరలివచ్చారు. మహీ ఏడో నంబర్ జెర్సీలు వేసుకొని, సీఎస్కే జెండాలు చేతపట్టుకున్నారు. హోమ్ టీమ్ సన్‌రైజర్స్‌ను కాదని ఈ పోరులో మహీకి, సీఎస్కేకు ఫ్యాన్స్ సపోర్ట్ ఇచ్చారు.
సగం కంటే ఎక్కువ స్టేడియం పసుపు మయం అయింది. ‘ధోనీ.. ధోనీ..’, ‘సీఎస్కే.. సీఎస్కే’ అంటూ ఫ్యాన్స్ హోరెత్తించారు. అతను బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఫ్యాన్స్‌తోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో స్టేడియం సందడిగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యామిలీతో కలిసి వచ్చి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సినీ నటులు చిరంజీవి, వెంకటేష్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.
మొత్తంగా 35 వేల 509 ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసింది. స్టేడియంలోకి మధ్యాహ్నం 3 గంటల నుంచే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో అభిమానులు ముందుగానే స్టేడియం వద్ద బారులు తీరారు. ఆ సమయంలో నాలుగో నంబర్ గేట్ వద్ద నుంచి లోపలికి అనుమతించకపోవడంతో అక్కడున్న పోలీసులు, ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్వల్ప తోపులాట జరిగింది. ఫ్యాన్స్ బారికేడ్లను దాటుకుని లోపలకి వెళ్లడానికి ప్రయత్నించారు
– హైదరాబాద్, వెలుగు