బషీర్‌బాగ్, వెలుగు: చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో ఎనిమిది రోజులపాటు రవిని విచారించిన పోలీసులు, కీలక సమాచారం, ఆధారాలు ఇంకా సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలియజేశారు. గత శుక్రవారం మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఈ సమయం సరిపోదని, ఐదు రోజులు కస్టడీ కావాలని రివిజన్ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన కుబేర, కిష్కిందపురి, తండేల్ తదితర హిట్ మూవీల పైరసీపై విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు చేసిన ఎనిమిది రోజుల కస్టడీ విచారణలో నెట్వర్క్, ఆర్థిక లావాదేవీల పై సైబర్ క్రైం పోలీసులు ఆరా తీశారు. ఐపీలను మాస్క్ చేసి నడుపుతున్న అనధికారిక వెబ్‌సైట్లు, పోర్న్ ప్లాట్‌ఫామ్‌లు, పైరసీ వీడియోలను అప్‌లోడ్ చేసే ముఠాల కార్యకలాపాలపై రవిని ప్రశ్నించినట్లు సమాచారం. రివిజన్ పిటిషన్ పై మంగళవారం వాదనలు జరగనున్నాయి.
