కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు:  కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించి ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా నివారిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్‌‌‌‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఈ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజుతో పలు దఫాలుగా చర్చించామని, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సానుకూలత ఏర్పడిందని స్పష్టం చేశారు. వర్షాకాలంలో వృథాగా పోతున్న వందల టీఎంసీల నీటిని కాపాడుకునేందుకు ఈ బ్యారేజీలు ఎంతో అవసరమన్న మంత్రి, ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు.

 ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారని, తెలంగాణ-కర్ణాటకలను కలుపుతూ గూడేబల్లూర్ నుంచి తంగిడి మీదుగా భీమా నదిపై వంతెన నిర్మాణం ప్రాధాన్యతను సీఎంకు వివరించనున్నట్లు చెప్పారు. 

పెండింగ్‌‌‌‌లో ఉన్న భూత్పూర్, నేరేడుగం ముంపు గ్రామాల ప్రజలకు రూ.1,500 కోట్ల నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్ రెడ్డికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆయన కాట్రేవుపల్లి గ్రామంలో ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు.