ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా: సంపత్ కుమార్ 

ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా: సంపత్ కుమార్ 

శాంతినగర్/ అయిజ వెలుగు:  అలంపూర్ నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరు అయిన ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తెలిపారు. బుధవారం వడ్డేపల్లి, అయిజ మండలాల్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్రలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో మాయమాటలతో గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, సీఎం రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి న్యాయం చేయగలుగుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని వల్లూరు, మల్లమ్మ కుంట, జూలకల్లు రిజర్వాయర్లను పూర్తి చేసి, డిస్ట్రిబ్యూటరీ 40 వరకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలి ఆచారి తదితరులు పాల్గొన్నారు.