సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో రూ.300 కోసం హత్య.. జేబులో డబ్బులు చూసి రాళ్లతో కొట్టి సంపిర్రు..!

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో రూ.300 కోసం హత్య.. జేబులో డబ్బులు చూసి రాళ్లతో కొట్టి సంపిర్రు..!

పద్మారావునగర్, వెలుగు: కేవలం రూ.300 కోసం ఓ యువకుడిని తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్​లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్ నిలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బుధవారం ఉదయం రైల్ నిలయం సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నట్లు డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, తలపై రాళ్లతో బలంగా బాదడం వల్లే తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు కేవలం డబ్బుల వివాదమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. 

మృతుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అడ్డుకున్న ఇద్దరు దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అతను నిరాకరించడంతో ఆగ్రహానికి గురై సమీపంలోని బండరాళ్లతో తలపై దాడి చేసి, జేబులో ఉన్న రూ.300 లాక్కుని పరారైనట్లు విశ్వసనీయ సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. 

అతని కుడిచేతిపై హిందీలో 'రీనా' అని, మరోచోట లవ్ సింబల్‌‌‌‌‌‌‌‌తో 'JS' అనే అక్షరాలు పచ్చబొట్టుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి 24 గంటలు గడవక ముందే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 
అయితే ఈ విషయమై లాలాగూడ పోలీసులను వివరణ కోరగా, కేసు దర్యాప్తులో ఉందని, నిందితులను అధికారికంగా ఇంకా అరెస్ట్ చూపించలేదని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు  ముమ్మరం చేశారు.

బోరబండ పీఎస్​ పరిధిలో వ్యక్తి మర్డర్

బంజారాహిల్స్, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాబా సైలానీ నగర్​కు చెందిన షాహెద్(30) అనే ప్లంబర్ పై బుధవారం రాత్రి దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షలతో నేపథ్యంలో హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.