ఎన్నికల కోడ్ మేరకు తనిఖీలు చేపట్టాలి : రోనాల్డ్ రాస్

ఎన్నికల కోడ్ మేరకు తనిఖీలు చేపట్టాలి : రోనాల్డ్ రాస్
  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
  • వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ మేరకు తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో  బ్యాంక్, ఆర్బీఐ, ఇన్ కమ్ ట్యాక్స్, విజిలెన్స్, ఆర్టీఏ, ఎన్సీబీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నగదు, లిక్కర్ తరలింపు అడ్డుకోవడానికి పార్సిల్, కొరియర్, ట్రైన్ చెకింగ్, సరిహద్దుల వద్ద నిఘాను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వైన్స్ షాపుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి కంట్రోల్ రూం ద్వారా మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు.

జిల్లాలో ఎక్సైజ్ శాఖ హాట్​స్పాట్​లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 ఇంటిగ్రేటెడ్ చెక్​పోస్ట్​ల ద్వారా తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఆర్బీఐ, పోస్టాఫీస్ ద్వారా ఆరు నెలల్లో ఎక్కువ మొత్తంలో క్యాష్ లావాదేవీలు, యూపీఐ ద్వారా ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ అకౌంట్లకు నగదు బదిలీల వివరాలను అందించాలని ఆదేశించారు. రూ.10 లక్షలకు మించి నగదు లావాదేవీలపై ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ, బ్యాంకులు రూ. 10 లక్షలకు మించి నగదు బదిలీ వివరాలను అందించాలని సూచించారు.

ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేసే వాహనాలపై నిఘా, కెమెరాలను ఏర్పాటు చేసి, అక్రమంగా తరలించే క్యాష్​ను సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ కు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఈవో, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్   పాల్గొన్నారు.

కాప్రా చెరువు బ్యూటిఫికేషన్

ఎల్​బీనగర్ జోన్ పరిధి కాప్రా సర్కిల్​లోని కాప్రా చెరువును కమిషనర్ పరిశీలించారు. చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు బల్దియా, ఇరిగేషన్, లేక్స్, టౌన్ ప్లానింగ్, యూబీడీ, శానిటేషన్ విభాగాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

కాప్రా చెరువు  వద్ద ఇల్లీగల్ యాక్టివిటీస్​ను అరికట్టడానికి 24 గంటలు సెక్యూరిటీ, లేక్ ప్రొటెక్షన్ గ్రూపులను నియమించామని పేర్కొన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ పంకజ, డీసీ ముకుంద్, ఇరిగేషన్ ఈఈ నారాయణ, సీఈ లేక్స్ సురేశ్​, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ ప్రసాద్ ఉన్నారు.