
- నిర్ధారించిన జిల్లా వైద్యాధికారులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
కూకట్పల్లి/పద్మారావునగర్, వెలుగు: కూకట్‌పల్లిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో నివసించే ఒక పల్మనాలజిస్ట్(శ్వాస సంబంధిత వ్యాధి నిపుణుడు)కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతను ఐదు రోజులు క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం ఏ వ్యాధి లక్షణాలు లేకుండా కోలుకున్నారు. ఇతని కుటుంబ సభ్యులతో పాటు, ఆస్పత్రికి వచ్చిన పేషెంట్స్, కాంటాక్ట్ అయిన వారందరికీ వైద్యులు కరోనా టెస్టులు పూర్తి చేశారు. ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని మేడ్చల్మల్కాజిగిరి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సి.ఉమాగౌరి ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్, అతని కుటుంబ సభ్యులతో పాటు, డాక్టర్ని కాంటాక్ట్ అయిన వారందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాలక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవటానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, లేదా పల్లె దవాఖానాలను సంప్రదించాలని డీఎంహెచ్‌వో ఉమాగౌరి సూచించారు.
‘గాంధీ’లో 45 బెడ్లతో రెండు కరోనావార్డులు సిద్ధం
కరోనా వైరస్మళ్లీ వ్యాపిస్తుందన్న వార్తలతో గాంధీ ఆస్పత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా కరోనా నోడల్ కేంద్రం గాంధీ ఆస్పత్రిలో మొత్తం 45 బెడ్స్‌తో కూడిన రెండు వార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో గాంధీ ఐపీ బిల్డింగ్ ఫార్మసీ స్టోర్ పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో 30 బెడ్స్, ఎమర్జెన్సీ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన వార్డులో 15 కరోనా బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎంవో డాక్టర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ పేషంట్లు ఎవరూ అడ్మిట్ కాలేద, ముందు జాగ్రత్త చర్యగా వార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, గాంధీ క్రిటికల్ కేర్ మెడిసన్ ప్రొఫెసర్ డాక్టర్కిరణ్ మాదాల మాట్లాడుతూ.. హంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ‘‘గతంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఒమిక్రాన్, జేఎన్-1 వేరియంట్ల కు సంబంధించిన సబ్ వేరియంట్లు ఇప్పుడు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో ఇంకా సృష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. శ్వాసకోశ వ్యాధుల్లో 60 శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు ఐసీఎమ్ఆర్ తాజా డేటా తెలియజేస్తోంది. ప్రస్తుతం భారత్ లో కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మనదేశంలో 164 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కేరళలో ఒక కరోనా మరణం కూడా సంభవించింది. ప్రస్తుతం మన దగ్గర కరోనా కేసులు పెరగనప్పటికీ ముందుజాగ్రత్తగా గాంధీ ఆస్పత్రిలో రెండు వార్డులను ఏర్పాటుచేశాం. సాధారణంగా మనలో ఇమ్యూనిటీ పవర్బాగానే ఉంటున్నందున వైరస్ తీవ్రత అంతగా ఉండకపోవచ్చు. కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం కరోనానిబంధనలు పాటించాలి. మాస్కు ధరించడంతో పాటు చేతులు తరచుగా శుభ్రంచేసుకోవాలి. ప్రస్తుత వేరియంట్ వైరస్ ల పట్ల అంతగా ఆందోళన చెందనవసరం లేదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం మేలు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి ట్రీట్మెంట్ పొందాలి”అని ఆయన సూచించారు.