గ్రేటర్‌‌ విలీనంపై గెజిట్.. జీహెచ్‌ఎంసీలోకి 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు

గ్రేటర్‌‌ విలీనంపై గెజిట్.. జీహెచ్‌ఎంసీలోకి 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు
  • జీవో జారీ చేసిన సీఎస్​ రామకృష్ణారావు
  • ఇక ఈ ప్రాంతమంతా అధికారంగా ‘సిటీ ఆఫ్​ తెలంగాణ కోర్ అర్బన్  రీజియన్’ 
  • డిసెంబర్ ​2 నుంచే అమల్లోకి..
  • విలీనం తర్వాత గ్రేటర్ పరిధి 1,942.73 చదరపు కిలోమీటర్లు 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ మహానగర పరిధిని భారీగా విస్తరిస్తూ రాష్ట్ర  ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్ జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, వెలుపల.. అలాగే, ఓఆర్‌‌ఆర్‌‌ను ఆనుకొని ఉన్న  20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్‌‌ఎంసీలో విలీనం చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విలీనంతో ఏర్పడిన విస్తృత ప్రాంతాన్ని ‘ సిటీ ఆఫ్​ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్’ (టీసీయూఆర్​)గా పేర్కొంటూ సీఎస్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో  విడుదల చేశారు. 

ఈ మేరకు జీహెచ్‌‌ఎంసీ చట్టం-1955కు సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 2 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ  విలీన ప్రక్రియ కోసం ప్రభుత్వం చట్టపరంగా కీలక మార్పులు చేసింది. ఇందుకోసం మంత్రివర్గంలో డ్రాఫ్ట్‌‌ ఆర్డినెన్స్‌‌కు ఆమోదం తీసుకోగా, వాటికి సోమవారం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు దీంతో వరుసగా మూడు ఆర్డినెన్స్‌‌లను ప్రభుత్వం జారీ చేసింది. తొలుత జీహెచ్‌‌ఎంసీ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-–2019 పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ఆ చట్టం నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. 

వెనువెంటనే ఈ 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని ‘సిటీ’ నిర్వచనం కిందకు మారుస్తూ మరో ఆర్డినెన్స్  జారీ చేసింది. దీంతో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పరిధిలో ఉన్న ఈ మున్సిపాలిటీ, కార్పొరేషన్​ ప్రాంతాలన్నీ ఇకపై ఏకీకృత పాలన కిందకు రానున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం డిసెంబరు 2 నుంచి ఈ మొత్తం ప్రాంతం అధికారికంగా ‘సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్’గా పిలుస్తారు. ఈ మేరకు అసాధారణ గెజిట్ నోటిఫికేషన్‌‌ను ప్రచురించాల్సిందిగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌‌ను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ శాఖ, లా డిపార్ట్‌‌మెంట్, ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ ఉత్తర్వుల ప్రతులను పంపించారు.  

కంటోన్మెంట్​ మినహాయిస్తే  1,942 చ. కిలోమీటర్లు

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లులుగా ఉంది.  ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం  1,982.9 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఇందులో 40.17 చదరపు కిలో మీటర్లు కంటోన్మెంట్ పరిధిలో ఉంది. ఇది  కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండటంతో ఇక్కడ ప్రత్యేకంగా బోర్డు ఉంది. ఈ పరిధి మినహా మిగతా మొత్తం టీసీయూఆర్ పరిధిలోకి రానున్నది. ఇక విలీనం తర్వాత గ్రేటర్ పరిధి 1,942.73 చదరపు కిలోమీటర్లుగా మారింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 98,74,600 మంది ఓటర్లు ఉండగా.. మొత్తం పాపులేషన్ 1,45,15,662గా ఉంది. అలాగే  విలీనం కానున్న లోకల్ బాడీస్‌‌లో మొత్తం 12,72,094 మంది ఓటర్లు ఉండగా, మొత్తం జనాభా 20,16,978 మంది ఉన్నారు. విలీనం తరువాత మొత్తం జనాభా 1.65 కోట్లకు చేరింది.