- జీవో రాకముందే ప్రతిపక్షాల చేతికి కీలక సమాచారం
- నవంబర్ 20న లీక్.. 21న కేటీఆర్ ప్రెస్మీట్.. 22న జీవో జారీ
- గుట్టురట్టు చేసిందెవరు? ఆఫీసర్లా.. ప్రజా ప్రతినిధులా?
- విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న పాలసీలు, తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు.. అధికారికంగా వెల్లడి కాకముందే ప్రతిపక్షాల చేతికి చిక్కుతున్నాయి. జీవోలు రాకముందే, ఇంకా డ్రాఫ్ట్ దశలో ఉండగానే ఆ ఫైళ్లు ప్రతిపక్ష నేతలకు చేరుతున్నాయి. తాజాగా ‘హిల్ట్’ పాలసీ విషయంలో జరిగిన ఈ సమాచార లీకేజీని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
ఇంకా కసరత్తు దశలో ఉండగానే.. ఫొటోషాప్ స్లైడ్లతో సహా సమాచారం బయటకు పొక్కడంపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. అసలు సెక్రటేరియెట్ లో ఏం జరుగుతోంది? ప్రభుత్వ రహస్యాలను బయటపెడుతున్న ‘కోవర్టులు’ ఎవరు? అన్న కోణంలో సీఎస్ రామకృష్ణారావు విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించి ‘హిల్ట్’ పాలసీ తేవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం నవంబర్17న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా జీవో రెడీ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు. దీనిపై కసరత్తుచేసిన పరిశ్రమల శాఖ నవంబర్ 22న జీవో విడుదల చేసింది. కానీ, అంతకంటే ముందే.. నవంబర్ 20న ఈ పాలసీకి సంబంధించిన కీలక సమాచారం, స్లైడ్స్ బయటకు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా నవంబర్ 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే.. ప్రతిపక్షానికి సమాచారం ఎలా చేరిందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేబినెట్భేటీలో నిర్ణయం జరిగిన ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి వివరాలు బయటకు వెళ్లడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు.
విజిలెన్స్ వేట షురూ..
పాలసీ తయారీ సమయంలోనే ఈ లీక్ జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించుకుంది. దీనిపై విజిలెన్స్ ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు ప్రారంభమైంది. పరిశ్రమల శాఖలో ఈ ఫైల్ ఎవరెవరి చేతుల మీదుగా వెళ్లింది? సెక్షన్ ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరెవరు ఈ ఫైల్ ను డీల్ చేశారు? అన్న వివరాలను సేకరిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి లీక్ అయ్యిందా? లేదంటే ఉన్నత స్థాయి అధికారులే దీని వెనుక ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఇలాంటి లీకులు ఇస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మున్ముందు ఇలాంటివి జరగకుండా గట్టి సంకేతాలు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది.
