హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మంత్రి కొండా సురేఖను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి స్వామివారి ప్రసా దం అందించి శాలువాతో సత్కరించారు. అనంత రం మంత్రి సురేఖ, టీటీడీ చైర్మన్‌కు యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ప్రతిమను అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు దేవాలయాల నిర్మాణానికి టీటీ డీ తీసుకుంటున్న చర్యలు, దళిత కాలనీల్లో నిర్మిస్తున్న దేవాలయాల గురించి ప్రస్తావించారు. మంథని, కొడంగల్, ఖమ్మం ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంత్రికి తెలిపారు. కొండ ప్రాంతాల్లోని ఆలయాల్లో రోప్‌వే నిర్మాణాలకు టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయాలని కొండా సురేఖ కోరారు.
వికారాబాద్ జిల్లా పరిగిలోని పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారి టెంపుల్, వరంగల్ జిల్లాలోని గోవింద రాజుల ఆలయంలో రోప్ వే నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రముఖ ఆలయాల్లో భజన మందిరాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నిధులు గతంలో ఇచ్చేదని, ఆ నిధులు మళ్లీ మంజూరు చేయాలని ఆయన దృష్టికి మంత్రి తీసుకెళ్లారు.
