మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేత అధికారులు బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు. ఈ విషయమై దండేపల్లి ఎస్సై తహసీనుద్దీన్, రిటర్నింగ్ ఆఫీసర్పై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఫస్ట్ ఫేస్ లో మంచిర్యాల నియోజకవర్గంలోని 90 సర్పంచ్లు, 816 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్లకు 518, వార్డు సభ్యులకు 1,749 నామినేషన్లు వచ్చాయి. విత్ డ్రాకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుండగా.. పాత మామిడిపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాధవి చేత అధికారులు బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.
విత్ డ్రా టైం ముగిసిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు మాధవిని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి ఎస్సై తహసీనుద్దీన్ బలవంతంగా తీసుకెళ్లి నామినేషన్ విత్ డ్రా చేయించారని వారు ఆరోపించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్సైతో పాటు రిటర్నింగ్ అధికారులు రూలింగ్ పార్టీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు.
దండేపల్లి మండలంలోని నాలుగు పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల చేత నామినేషన్ విత్ డ్రా చేయించారని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
