దండేపల్లి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమవుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మూడు గ్రామపంచాయతీలకు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఒక్కరు మినహా నామినేషన్వేసిన మిగతావారంతా విత్ డ్రా చేసుకోవడంతో ఉన్న అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులైన కొండాపూర్ లో ఇప్ప రవళి, కొత్త మామిడిపల్లిలో కస్తూరి చిన్న పోచం, ముత్యంపేటలో కుడిమెత తిరుపతి ఏకగ్రీవమయ్యారు. దండేపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలకు గాను గూడెం, నెల్కి వెంకటాపూర్, వందూర్ గూడలలో ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. మిగత 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
జన్నారం మండలంలో రెండు..
జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లోతొర్రె, లింగయ్యపల్లె గ్రామపంచాయితీలకు సర్పంచ్ లు ఎకగ్రీవంగా ఎన్నికైయ్యారు. లోతొర్రె సర్పంచ్ గా బోడ శంకర్ ఎకగ్రీవంగా ఎన్నికకాగా.. అదే పంచాయితీలో ఉన్న 8 వార్డులకు గాను 8 మంది వార్డు సభ్యులు ఎకగ్రీవమైనట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. మండలంలోని లింగయ్యపల్లె గ్రామపంచాయితీ సర్పంచ్ గా కొత్తపల్లి వనిత ఎకగ్రీవం కాగా, అదే పంచాయతీలో ఉన్న 10 వార్డులకు గాను 10 మంది వార్డు సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అడవి సారంగాపూర్, మేడంపల్లి స్థానాలు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం మేడంపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు రిజర్వ్ కాగా గుగ్లావత్ రాజేందర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అలాగే 6 వార్డు సభ్యులు ఒక్కో నామినేషన్ దాఖలు చేయడంతో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఖానాపూర్ మండలం అడవి సారంగాపూర్ గ్రామ సర్పంచ్ గా మాస్ లైన్ కు చెందిన మాడవి అంకుశ్ రావు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 4 వార్డులు కూడా ఏకగ్రీవాలయ్యాయి.
