డబ్బు విషయంలో తేడాలు.. భార్యతో అఫైర్ ఉందనే డౌట్.. మలక్‌పేట కాల్పుల కేసులో వీడిన మిస్టరీ

డబ్బు విషయంలో తేడాలు.. భార్యతో అఫైర్ ఉందనే డౌట్.. మలక్‌పేట కాల్పుల కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని మలక్ పేటలో కలకలం రేపిన కాల్పుల ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో నిందితులు టార్గెట్ చేసి చంపేసిన చందు నాయక్ను చంపింది నెల్లూరుకు చెందిన సుపారీ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. చందు నాయక్ హత్యకు రాజేష్ సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏడు రౌండ్లు కాల్పులు జరిపి చందు నాయక్ను రాజేష్ ముఠా చంపేసింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ మీడియాకు వెల్లడించారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కేతావత్ చందు నాయక్ను జులై 15న గన్తో కాల్చి చంపారు. హత్యకు గురైన చందు నాయక్ సీపీఐ పార్టీ స్టేట్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు, గతంలో కొన్ని కేసుల ఆధారంగా నెల్లూరుకు చెందిన ఒక ముఠా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మలక్ పేట శాలివాహన నగర్ పార్క్ దగ్గర జరిగిన ఘటనకు ముందు రోజు దుండగులు రెక్కీ నిర్వహించి హత్య చేశారు. హత్య చేసిన నిందితులను దొంతి రాజేష్ అలియాస్ రాజేష్, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞాన ప్రకాష్, లింగిబేడి రాంబాబు, కందుకూరి ప్రశాంత్లుగా గుర్తించినట్లు డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు.

సీపీఐ (ఎం. ఎల్) పార్టీకి చెందిన రాజన్న అలియాస్ రాజేష్ సీపీఐ పార్టీలో చేరుతానని చందు నాయక్ను కోరాడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి గుడిసెలు వేసిన క్రమంలో బాధితుల నుంచి కొంత డబ్బు వసూలు చేశారు. ఈ డబ్బుల విషయంలో ఇద్దరికీ తేడాలొచ్చాయి. ఈ హత్యకు సంబంధించి గతంలో వసూలు చేసిన 13 లక్షలు కూడా కారణంగా తేలింది. చందు నాయక్ బామ్మర్దికి, బిల్డర్ బాల్ రెడ్డికి మధ్య జరిగిన గొడవలో బాల్ రెడ్డిని రాజేష్ బెదిరించి 15 లక్షలు తీసుకున్నాడు. అయితే.. ఈ డబ్బును చందు నాయక్కు రాజేష్ ఇవ్వలేదు. అప్పటి నుంచి చందు నాయక్కు, రాజేష్కు మధ్య శత్రుత్వం పెరిగింది.

Also Read:-నెలకు ఆరు వేల భరణం కట్టలేక.. సెకండ్ వైఫ్ను పోషించలేక.. చైన్ స్నాచర్గా మారిన భర్త !

రాజేష్కు ఒక మహిళతో ఉన్న అక్రమ సంబంధాన్ని చందు నాయక్ రాజేష్ భార్యతో కలిసి బట్టబయలు చేశాడు. అప్పటి నుంచి.. రాజేశ్ భార్యతో చందు నాయక్కు అక్రమ సంబంధం ఉందని రాజేష్ అనుమాన పడ్డాడు. రాజేష్, చందు నాయక్ మధ్య వివాదం ముదరడంతో పార్టీ పెద్దల సమక్షంలో చర్చలు జరిపి రాజీ కుదిర్చారు. అయినా రాజేష్ తన కోపాన్ని వీడలేదు. ఈ క్రమంలోనే చందు నాయక్ హత్యకు రాజేష్ ప్లాన్ చేశాడు. ఏపీలోని నెల్లూరుకు చెందిన గ్యాంగ్కు సుపారీ ఇచ్చి చందు నాయక్ ను రాజేష్ హత్య చేశాడు.