హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి ఎయిర్ పోర్ట్లోనే ప్రయాణికులు పడిగాపులు గాశారు. ఎదురుచూస్తూ గంటలు గడిచినా హైదరాబాద్ నుంచి వియత్నాం విమానం బయల్దేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
ఎయిర్ పోర్ట్ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఏం చేయలేమని.. సాంకేతిక సమస్య తలెత్తిందని.. విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు. తేదీ 07-11-2025 రాత్రి 23.55 నిమిషాలకు VN - 984 హైదరాబాద్ నుంచి హానోయ్ (వియత్నాం ) వెళ్ళవలసిన విమానం టెక్నికల్ ఇష్యూతో ఉదయం 6.30 నిమిషాలకు కూడా బయలుదేరక పోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (IGIA)లో కూడా శుక్రవారం గందరగోళం నెలకొంది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో తలెత్తిన టెక్నికల్ సమస్యతో వందకు పైగా విమానాలు ఆగిపోయాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాల రాకపోకలకు సంబంధించి ఆటో ట్రాకింగ్ సిస్టం (ATS) సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
