కోకాపేటలో ఎకరం రూ76.5 కోట్లు..కొనసాగుతున్న ప్లాట్ల వేలం

కోకాపేటలో ఎకరం రూ76.5 కోట్లు..కొనసాగుతున్న ప్లాట్ల వేలం

 

  •  6,7,8,9 ప్లాట్లకు ముగిసిన వేలం
  • కాసేపట్లో అధికారిక ప్రకటన

హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌లో సర్కారు నిర్వహించిన భూముల వేలానికి విశేష స్పందన వచ్చింది. అత్యధికంగా ఎకరాకు 76.5 కోట్లు.. అత్యల్పంగా 51.75 కోట్లు పలికింది. ఇక్కడ ప్రభుత్వం కనీస ధర ఎకరాకు రూ. 35 కోట్లుగా నిర్ణయించింది. వేలంలో పాల్గొనాలంటే కనీసం రూ. 25 లక్షల ధర పెంచాలని హెచ్ఎండీఏ నిబంధన పెట్టింది. ఎంఎస్ టీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఆక్షన్ కొనసాగుతోంది. 2021లో తొలి దఫా ఇక్కడ ప్లాట్లకు వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు 49కి పైగా ప్లాట్లను విక్రయించి రూ. రెండు వేల కోట్లకు పైగా ఆదాయాన్ని హెచ్ఎండీఏ ఆర్జించింది. అప్పుడు అత్యధికంగా ఎకరా ధర రూ. 60 కోట్ల వరకు పలికింది. 

ఇవాళ నిర్వహించిన రెండో దశ ఈ-వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటా పోటీగా బిడ్లు దాఖలు చేశాయి. ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. మైహోం, రాజపుష్ప సంస్థల మధ్య భూములను చేజిక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. మధ్యాహ్నం వరకు 6,7,8,9 ప్లాట్లకు వేలం పూర్తయింది. అత్యధికంగా ఎకరాకు రూ. 72 కోట్లు పలికింది. అయితే శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ఈ జాగాకు డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 10, 11,14 ప్లాట్లకు వేలం జరుగుతోంది. ఈ 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్‌లను విక్రయించడం ద్వారా రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత పూర్తి వివరాలను హెచ్ఎండీఏ విడుదల చేసే అవకాశం ఉంది. 


ప్లాట్‌ల వివరాలు 

ప్లాట్ నం    ఎకరం ధర (కోట్లలో)
6                  62
7                  64
8                  55.5
9                  76.5
10               (కొనసాగుతోంది)
11               (కొనసాగుతోంది)
14               (కొనసాగుతోంది)