- రాష్ట్రానికి ఇప్పటిదాకా రూ.10 లక్షల కోట్లు ఇచ్చినం
- ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్
- గ్లోబల్ సమిట్‌తో సిటీకి మరిన్ని పెట్టుబడులు
- త్వరలోనే దేశంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ఆశాభావం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ టెక్నాలజీ, ట్రెడిషన్ల కలయిక అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సిటీ మూలస్తంభం. దేశంలోని డైనమిక్ ఎకానమీకి ఆయువుపట్టుగా.. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్రంగాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతూ భవిష్యత్తును నిర్మించుకోవడం మనందరి సమష్టి బాధ్యత. ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వంతో కలిసి పనిచేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని తెలిపారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో కిషన్ రెడ్డి పాల్గొ ని మాట్లాడారు. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారిందన్నారు.
ఈ సమిట్ ద్వారా నగరానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘మోదీ ప్రధాని అయ్యాక దేశ ముఖచిత్రం మారిపోయింది. అవినీతి రహిత, పారదర్శకపాలన వల్లే పెట్టుబడిదారులకు భారత్‌పై నమ్మకం పెరిగింది. ప్రపంచంలోనే భారత్ పవర్ ఫుల్ దేశంగా మారింది. డిజిటల్ రంగంలోనూ దూసు కెళ్తున్నం. 2014 నుంచి 2025 వరకు దేశానికి 748.78 బిలియ న్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఇది 143 % ఎక్కువ” అని చెప్పారు.
సౌలతుల కల్పనకు భారీగా నిధులు..
2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసం పన్నులు, గ్రాంట్లు, ఇతర పథకాల రూపంలో కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘‘జాతీయ రహదారులకు రూ.1.5 లక్షల కోట్లు, రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.32 వేల కోట్లు కేటాయించాం. అమృత్ భారత్ స్కీం కింద రూ.2,500 కోట్లతో 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నం. రామగుండంలో రూ.11 వేల కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మించాం ” అని కిషన్ రెడ్డి చెప్పారు.
పోటీ పడితేనే ప్రగతి..
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాష్ట్రాల సహకారం కీలకమని కిషన్ రెడ్డి అన్నారు. పెట్టుబడులు, స్టార్టప్స్‌ను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ.. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సహకార, పోటీతత్వ సమాఖ్య స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

