సెల్ఫ్ డ్రైవ్ కార్ ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిందనే చెప్పాలి. జామ్ కార్, లాంగ్ డ్రైవ్స్ వంటి యాప్స్ వాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ యాప్స్ లో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా గట్టిగానే ఉంటాయి. షూరిటీ తప్పనిసరి, కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ తో సహా.. వీడియో డిక్లరేషన్ కూడా రికార్డ్ చేస్తారు. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ వంటి.. ఫీచర్స్ ఉన్న యాప్స్ లో మోసం జరగడం అరుదు అనే చెప్పాలి. అయినప్పటికీ హైదరాబాద్ లో ఓ కస్టమర్ సెల్ఫ్ డ్రైవ్ కారు ఓనర్ నే బురిడీ కొట్టించాడు. హైదరాబాద్ లో కారు అద్దెకు తీసుకొని అమృత్ సర్ లో అమ్మేశాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
చందానగర్ లోని బీహెచ్ఈఎల్ కాలనీలో నివాసం ఉంటున్న సుమన్ అల్లగిరి దగ్గర హైక్రాస్ కారు సెల్ఫ్ డ్రైవ్ యాప్ లో అద్దెకు తీసుకున్నాడు నజీర్ అనే వ్యక్తి. జనవరి 27న జూమ్ కార్ యాప్ లో బుక్ చేసుకొని కారు అద్దెకు తీసుకున్నాడు నజీర్. బంధువుల పెళ్లి కోసం అని చెప్పి తప్పుడు ఆధార్ కార్డుతో కారు అద్దెకు తీసుకున్నది నజీర్. ఆ తర్వాత రోజులు గడుస్తున్నా కారు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నజీర్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.
బాధితుడి ఫిర్యాదుతో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా కారును గుర్తించారు పోలీసులు. పంజాబ్ లోని అమృత్ సర్ లో కారును రూ.11 లక్షల 50 వేలకు అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. అయితే .. అప్పటికే కారు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఆదాయం వస్తుంది కదా అని సెల్ఫ్ డ్రైవ్ లో కారు పెడితే.. మొదటికే మోసం వచ్చిందని వాపోతున్నాడు బాధితుడు.
