అమెరికాలో హైదరాబాద్ వ్యక్తిని చంపిన దుండగులు

అమెరికాలో హైదరాబాద్ వ్యక్తిని చంపిన దుండగులు

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన 37ఏళ్ల వ్యక్తి ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పాతబస్తీ చంచల్ గూడాకు చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ మోహియుద్దీన్‌ అనే వ్యక్తి గత పదేళ్లుగా జర్జియాలో నివాసముంటున్నాడు. అక్కడ స్థానికంగా కిరణం షాపు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి దగ్గర ఉన్న ఆరిఫ్‌పై కొంతమంది దుండగులు దాడి చేసి  తర్వాత కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన అరిఫ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి

ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆరిఫ్‌ కుటుంబ సభ్యులకు జార్జియా పోలీస్ లు తెలిపారు. దీంతో తను, తన తండ్రి అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్‌ భార్య మెహ్నాజ్ ఫాతిమా వేడుకున్నారు. యూఎస్‌లో తమకు ఎలాంటి బంధువులు లేరని, భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో మాట్లాడినట్లు, అతను అరగంటలో తిరిగి కాల్‌ చేస్తానని చెప్పినట్లు ఫాతిమా తెలిపారు.  అయితే అతని నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదని కొంత సమయానికి తన భర్తను ఎవరో పొడిచి చంపినట్లు బావ ద్వారా తెలిసిందన్నారు. జార్జియాలోని  ఆస్పత్రిలో ఉన్న భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఫాతిమాను యూఎస్‌ పంపించాలని కోరుతూ కుటుంబం తరపున లేఖ రాశారు.