వీడియో: మానవత్వం మరిచిన హైదరాబాదీ.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగకుండా నెట్టించాడు

వీడియో: మానవత్వం మరిచిన హైదరాబాదీ.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగకుండా నెట్టించాడు

రాపిడో బైక్.. హైదరాబాద్ నగరవాసులకు ఈ సేవల గురించి బాగా సుపరిచతమే. ఐటీ మరియు ఇతర కంపెనీల ఉద్యోగులు సహా సామాన్య ప్రజలు రాపిడో సేవలను వినియోగిస్తుంటారు. ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే.. తక్కువ ధరలో, సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈ సేవలు బాగా ఉపయోగపడుతుంటాయి. అంతేకాదు, నిమిషాల వ్యవధిలో ఫోన్‌ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. 

ఒకరకంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాక అంతో ఇంతో నిరుద్యోగులకు ఉపాధి దొరికినట్లయ్యింది. ఆ జీవనోపాదే ఓ రాపిడో రైడర్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మార్గమధ్యలో పెట్రోల్ అయిపోగా.. ప్రయాణికుడు బైక్ దిగనని మొండికేశాడు. 'పెట్రోల్ అయిపోతే నేనేం చేయను.. డబ్బు చెల్లిస్తున్నా కదా..! నేనెందుకు నడవాలి..' అని బైక్ మీదనే కూర్చున్నాడు. దీంతో రైడర్‌ చేసేదేం లేక అతన్ని నెట్టుకుంటూనే ముందుకు తీసుకెళ్లాడు. వెనుక వస్తున్న వాహనదారులు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటన హైదరాబాద్‌‌లోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

మానవత్వం అన్నదే లేదు..!

వీడియోను తిలకిస్తున్న నెటిజెన్లు.. సదరు ప్రయాణికుడిపై  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తోటి వ్యక్తిగా అతని పట్ల జాలి చూపాల్సింది పోయి అడవి మనిషిలా ప్రవర్తించాడని కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మరికొందరు రాపిడో సంస్థ తీరును తప్పుబడుతున్నారు. లాభాపేక్ష చూసుకునే సంస్థే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలని కోరుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోవడంతో బాగా వైరల్ అవుతోంది.