మంజీరాకు కొత్త పైప్లైన్ వేసి తీరాల్సిందే.. తరచూ పగులుతున్న పైప్లైన్

మంజీరాకు కొత్త పైప్లైన్ వేసి తీరాల్సిందే.. తరచూ పగులుతున్న పైప్లైన్
  • భారీ లీకేజీలతో నీటి సరఫరాకు బ్రేక్​ 
  • 45 ఎంజీడీల్లో 3 ఎంజీడీలు అవుట్​ 
  • బడ్జెట్​లో నిధులివ్వని రాష్ట్ర సర్కార్​
  • కేంద్రం, రాష్ట్ర సహకారం,    లోన్లతో పూర్తి చేసే ప్లాన్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు : నగరానికి తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలాశయాల్లో ఒకటైన మంజీరాకు కొత్త పైప్​లైన్​ నిర్మాణంపై వాటర్​బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న పైపు లైన్​కు సమాంతరంగా కొత్త పైప్ లైన్ ను సాధ్యమైనంత తొందరగా వేయాలని అధికారులు నిర్ణయించారు. మొదట్లో ఈ ప్రాజెక్టు కు అవసరమైన రూ. 722 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని వాటర్​బోర్డు ఆశతో ఉంది. అయితే, బడ్జెట్ లో  కేటాయింపులు లేకపోవడంతో ఎలాగైనా ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నారు. 

పగులుడు.. లీకేజీలు..

మంజీరా నుంచి రెండు దశల్లో నగరానికి నీటిని తరలిస్తుండగా, తరచూ పైప్​లైన్​పగిలిపోతుండడం, భారీ లీకేజీల వల్ల తరచూ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోంది. రిపేర్ల వల్ల ఒక్కోసారి 24గంటలు, మరోసారి 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సి వస్తున్నది. అంతే కాకుండా నీటి వృథా కూడా ఎక్కువే అవుతున్నది. ఈ రిజర్వాయర్​నుంచి రోజుకు 45 ఎంజీడీలు తరలిస్తుంటే లీకేజీలు, పైప్​లైన్​పగలడం వల్ల సిటీకి చేరేసరికి దాదాపు 3 ఎంజీడీలు వృథా అవుతోంది.

మంజీరా మొదటి దశను 60 ఏండ్ల క్రితం, రెండో దశ 35 ఏండ్ల క్రితం నిర్మించారు. ఇది  సిమెంట్ పైప్ లైన్ కావడం వల్ల  పాడైపోయి తరచూ పగిలిపోవడంమో, లీకేజీలు ఏర్పడడమో జరుగుతున్నది. దీంతో రిపేర్లకు రూ. లక్షలు వెచ్చించాల్సి వస్తున్నది. తాజాగా వాటర్​బోర్డు పరిధి పెరిగి ఓఆర్ఆర్​అవతలి వరకూ నీటి సరఫరా చేయాల్సిన బాధ్యత వచ్చి పడింది. రోజు రోజుకూ నీటి డిమాండ్​పెరుగుతుండడంతో బోర్డుపై భారం పడుతోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా నీటి వృథా తగ్గుతుందని భావిస్తున్నారు.

రూ.722 కోట్లతో ప్రాజెక్టు

మంజీరా పాత పైప్​లైన్​స్థానంలో దానికి సమాంతరంగా కొత్త పైప్​లైన్​ నిర్మాణం చేపట్టాలని వాటర్​బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రాజెక్టుకు ప్రభుత్వం కూడా గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. అయితే, నిధుల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తుండగా బడ్జెట్​లో కేటాయింపులు జరపలేదు. దీంతో ఎలాగైనా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న సిమెంట్​పైపుల స్థానంలో కొత్తగా  మైల్డ్ స్టీల్ (ఎంఎస్​) పైప్ లైన్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

దీని కోసం అవసరమైన రూ.722 కోట్లను వివిధ మార్గాల ద్వారా సేకరించాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.180  కోట్లను,  రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.180 కోట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. మిగిలిన రూ.362 కోట్లను లోన్​తీసుకోవాలని అనుకుంటున్నారు. దీని కోసం త్వరలో ప్రాజెక్ట్ వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపనున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి గ్రీన్​ సిగ్నల్​వస్తే వెంటనే మంజీరా పైప్​లైన్​ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశం ఉంది.