మూగజీవాల ఆమ్​ఆద్మీ త్రిమూర్తి పిల్లై

మూగజీవాల ఆమ్​ఆద్మీ త్రిమూర్తి పిల్లై

నాంపల్లి – వెలుగు: నాంపల్లి బజార్ ఘాట్ ఏరియాకు చెందిన త్రిమూర్తి పిల్లై మూగజీవాలకు ఆమ్​ఆద్మీగా మారారు. 70ఏళ్ల వయసు.. దివ్యాంగుడు అయినప్పటికీ తన రోజూవారీ సంపాదనలో కొంత జీవాలకు ఆహారంగా వెచ్చిస్తున్నాడు. నాంపల్లి ప్రభుత్వ దవాఖానా దగ్గర బైక్ ​రిపేర్​ సెంటర్ ​నిర్వహిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా అటవీ ప్రాంతాలకు వెళ్లి కోతులు, పాములు, వణ్యప్రాణులకు ఆహారాన్ని వేస్తాడు. ప్రతి ఆదివారం కోతులకు తిండిగింజలు అందిస్తాడు. నాంపల్లిలోని తన మెకానిక్ షాప్​ దగ్గరికి సాయంత్రం గద్దలు, కాకులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తాయి. గద్దల తిండి కోసం మాంసం ముక్కలను ఆహారంగా వేస్తాడు.

రోజూ 20 నుంచి 30 దాకా ఎక్కడెక్కడి నుంచో గద్దలు రావడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆవులు, కుక్కలు, కోళ్లు, పక్షులు ఇలా ఏవి కనిపిస్తే వాటికి కావల్సిన ఆహారం అందిస్తాడు. నెలకు తన సంపాదన నుంచి రూ.15 వేలు మూగజీవాల కోసం ఖర్చు చేస్తున్నాడు. దీనికితోడు దాతలు, జంతు ప్రేమికులు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. బ్లూ క్రాస్​వెల్ఫేర్​ సొసైటీ ఫౌండర్, సినీనటి అక్కినేని అమల రూ.10వేలు సాయం చేశారు. త్రిమూర్తి సేవలు చూసి ఆమ్​ఆద్మీ అవార్డు, నారాయణ సేవ సంస్థాన్​ పురస్కారం అందించాయి.