
- మంగళవారం అర్ధరాత్రి నుంచి నాన్‌స్టాప్
- మరో మూడు రోజులు వానలు
- ఐటీ కంపెనీలకు వర్క్‌ఫ్రం హోమ్ ఇవ్వాలని పోలీసుల సూచన
- అలర్ట్‌గా ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు వాన దంచికొట్టింది. రాత్రి భారీ వర్షం కురవగా, పగటిపూట ముసురు కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు షేక్ పేటలో 8.65 సెంటిమీటర్లు, టోలిచౌకీలో 6.50, లంగర్ హౌస్ లో 6.20, గచ్చిబౌలిలో 6.15, లింగంపల్లిలో 5,28 సెంటిమీటర్లు పడింది. మళ్లీ రాత్రి భారీ వర్షం కురవగా, 12 గంటల వరకు అత్యధికంగా కుత్బుల్లాపూర్ 3.45 సెం.మీ, బాలానగర్ 3.30 సెం.మీ, బంజారాహిల్స్ 3.20, హఫీజ్‌పేట3.10, మియాపూర్, జూబ్లీహిల్స్ 3.50 సెం.మీ. వర్షం పడింది. మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో అధికారులు అలర్టయ్యారు.
ఐటీ కంపెనీలకు పోలీసుల సూచన
ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు సలహా ఇచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఐటీ కంపెనీల యజమానులకు రిక్వెస్ట్ పంపారు. వర్షాలు కురిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఐటీ ఉద్యోగులతో పాటు సాధారణ జనాలు గంటల తరబడి ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఐటీ కంపెనీలను అలర్ట్ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై బుధవారం బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీపీ సీవీ ఆనంద్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో మాట్లాడారు.141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.