మెట్రో టైమింగ్స్ పొడిగింపు

మెట్రో టైమింగ్స్ పొడిగింపు

అర్ధరాత్రి 1గంట వరకు అందుబాటులో మెట్రో రైళ్లు
హైదరాబాద్:
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైల్ టైమింగ్స్ ను అధికారులు పొడిగించారు. ఈనెల 19తేదీన ఆదివారం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగనున్న నేపధ్యంలో రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపు జరుగుతున్నందున ప్రయాణికుల ఇబ్బందులు కలుగకుండా మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచనున్నారు. అర్ద రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. మూడు మెట్రో కారిడార్లలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చివరి ట్రైన్ అర్ధరాత్రి 1గంట వరకు మెట్రో స్టేషన్స్ చేరుకుంటాయి. ప్రయాణికులు అందరు కరోనా జాగ్రత్తలు తప్పని సరిగా పాటించలని సూచించిన మెట్రో ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి కోరారు. 

శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు
ఆదివారం హైదరాబాద్ లో  జరిగే గణేశ్ శోభా యాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు. భాగ్యనగర శోభాయాత్రకు దేశవ్యాప్త గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అన్ని విభాగాల సమన్వయం కోసం వాట్సాప్ గ్రూపు కూడా ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వనున్నారు. ట్యాంక్ బండ్ పై 40 క్రేన్ల ద్వారా గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని  క్రేన్ నంబర్ 6  దగ్గర  నిమజ్జనం చేయనున్నారు. హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు...హుస్సేన్ సాగర్ పై అంబులెన్సులను సిద్ధంగా  ఉంచడంతో పాటు..1,25,000 మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు 19వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.