
- 8,380 పాట్ హోల్స్ లో 2,871 పూడ్చినమన్న ఆఫీసర్లు
- వర్షాలు దంచికొడితే కొట్టుకుపోతాయంటున్న జనాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాకాలంలో జీహెచ్ఎంసీ రోడ్లపై గుంతలు పూడ్చే పనులు మొదలుపెట్టింది. నిజానికి, వర్షాకాలానికి ముందు ప్రీ -మాన్సూన్పనులు చేపట్టాలి. ఇందులో భాగంగా రోడ్లపై గుంతలు పూడ్చడం, నాలాల్లో పూడిక తీయడం, క్యాచ్‌పిట్‌లను క్లియర్ చేయడం వంటి పనులు చేయాలి. కానీ, జీహెచ్‌ఎంసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వర్షాకాలం మొదలైన నెల రోజుల తర్వాత తీరిగ్గా సేఫ్టీ డ్రైవ్ పేరుతో రిపేర్లు చేస్తూ హడావిడి చేస్తోంది.
గ్రేటర్ లో మొత్తం 8,380 పాట్ హోల్స్ గుర్తించామని, ఈ నాలుగు రోజుల్లో 2,871 పాట్ హోల్స్ పూడ్చినట్లు బల్దియా చెప్తోంది. అయితే, గుంతల్లో కంకర, తారు వేస్తుండడంతో వచ్చే ఒక్క వర్షానికి అవి కొట్టుకుపోయే అవకాశముంటుందని సిటీ జనాలు ఆరోపిస్తున్నారు. బుధవారం నుంచి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా ప్రకటించడంతో ఇప్పటివరకు పూడ్చిన గుంతలు పూర్వ స్థితికి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ఎండాకాలంలోనే డ్యామేజ్
ప్రతి ఏటా వర్షాకాలం ముగిసే తరుణంలో జీహెచ్ఎంసీ పాట్ హోల్స్ గుర్తిస్తోంది. ఎన్ని గుంతలు ఉన్నాయో కూడా అప్పుడే లెక్క చెప్తుంది. ఒకవేళ వర్షాకాలంలో ఎక్కడైనా కొన్ని ప్రమాదకరమైన గుంతలు ఏర్పడితే వానలకు కొట్టుకుపోకుండా వాటిని పటిష్టంగా పూడుస్తుంది. కానీ, ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మే నెలలోనే భారీ వర్షాలు పడ్డాయి. తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వాన పడలేదు. మే నెలకు ముందే నగరంలోని చాలాచోట్ల రోడ్లు ఖరాబయ్యాయి.
వేల సంఖ్యలో పాట్ హోల్స్ ఏర్పడ్డాయి. అప్పుడే రిపేర్లు చేస్తే రోడ్ల పరిస్థితి మరీ ఇంత అధ్వానమయ్యేది కాదు. రిపేర్లు చేయకపోవడంతో అవి మరింత పెద్దగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు బల్దియా గ్రీవెన్ సెల్ కి కూడా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు స్పందించి వర్షాలు పడతాయని చెప్తున్న టైంలో రిపేర్లు మొదలుపెట్టారు.
ఆగని రోడ్ల తవ్వకాలు
వర్షాకాలంలోనూ జలమండలి పైపులైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్, ఎలక్ర్టిసిటీ, కేబుల్స్ తదితర పనులంటూ రోజూ రోడ్లను ఎక్కడపడితే అక్కడ తవ్వుతూనే ఉంది. మెయిన్రోడ్ల నుంచి ఇంటర్నల్ రోడ్ల వరకు ఇదే పరిస్థితి ఉంది. వర్షాకాలంలో రోడ్లు తవ్వవద్దని జీహెచ్ఎంసీ చెప్తున్నా వాటర్ బోర్డ్ వినిపించుకోవడం లేదు. రోడ్డు తవ్వే ముందు బల్దియా నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉన్నా లైట్తీసుకుంటున్నారు. వర్క్స్ అయిపోయాక కాంట్రాక్టర్ తిరిగి రోడ్డు వేయాల్సి ఉన్నా మట్టి పోసి వదిలేస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.