
- హెచ్ఎండీఏ పరిధిలో 3,262 చెరువులు
- కబ్జాకు గురవకుండా ఎఫ్టీఎల్ నిర్ధారణకు చర్యలు
- త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నీటి వనరుల రక్షణకు మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్అథారిటీ(హెచ్ఎండీఏ) సన్నాహాలు చేస్తోంది. చెరువులు కబ్జాకు గురవకుండా ఎఫ్టీఎల్ నునిర్ధారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నిజానికి హెచ్ఎండీఏ పరిధి విస్తరించక ముందే 7 జిల్లాల్లో నీటి వనరులపై అధికారులు లేక్ ప్రొటెక్షన్‌లో భాగంగా సర్వే నిర్వహించి, మొత్తం 3,262 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు 3,532 చెరువులు ఉన్నట్లు గుర్తించినా.. తప్పుడు లెక్కల వల్లనో, రూపం కోల్పోవడం వల్లనో కొన్ని మాయమయ్యాయి. తాజాగా ఇరిగేషన్, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి సంస్థ(సీడీఏ) ఆధ్వర్యంలో ఉన్న కొన్ని చెరువులను కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఎక్కడ చెరువులు కనిపిస్తే అక్కడ భూ కబ్జాదారులు వాలిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, కబ్జా చేస్తున్నారు. ఇలా ఇప్పటికే వందలాది చెరువులు కబ్జాకు గురయ్యాయి. దీంతో హెచ్ఎండీఏ అధికారులు ప్రస్తుతం ఉన్న అన్ని నీటి వనరులను సంరక్షించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. చెరువుల ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తే ఎవరైనా కబ్జా చేసినా, వాటిని తొలగించేందుకు, చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఓఆర్ఆర్చుట్టూ ఎక్కువ చెరువులు ఉన్నాయి. ఓఆర్ఆర్ వరకు నగరం విస్తరిస్తుండడంతో భారీ సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త కాలనీలు, నివాసాలు పుట్టుకొస్తుండడంతో చెరువులు కబ్జా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గతంలో ఓఆర్ఆర్ చుట్టూ వ్యవసాయమే జరిగేది. దీంతో ప్రభుత్వం చెరువులను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం భారీ సంఖ్యలో వెంచర్లు, పెద్ద పెద్ద లేవుట్లు వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చెరువులను కాపాడుకోవడం కీలక అంశంగా మారింది.
హైకోర్టు ఆదేశాలతో ముందుకు..
ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులను కాపాడాలని హైకోర్టు ఇటీవల హెచ్ఎండీఏను ఆదేశించింది. దీంతో ఆ దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్డిపార్ట్మెంట్ల మ్యాప్‌ల ఆధారంగా మార్కింగ్ చేస్తున్నారు. అలాగే ఇరిగేషన్, సీడీఏ పరిధిలోని చెరువులకు కూడా ఎఫ్టీఎల్గుర్తించనున్నారు. ఓఆర్ఆర్లోపల 476, బయట 2,786 చెరువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వీటిలో ఇరిగేషన్, సీడీఏ పరిధిలో 607 ఉన్నాయన్నారు. ఎఫ్టీఎల్నిర్ధారణ కోసం 2,933 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా పూర్తిస్థాయిలో నిర్ధారణ చేసినవి 1,225 అని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్నిర్ధారించిన తర్వాత చెరువుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీనివల్ల ఆక్రమణలు ఆగిపోతాయని అంటున్నారు.